24-12-2025 05:50:28 PM
గీతంలో ఆర్ట్ స్కేప్-25 పేరిట మూడు రోజుల వేడుకలు
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో నృత్యం, సంగీతం, దృశ్య కళలను వేడుకగా జరుపుకునే మూడు రోజుల సాంస్కృతిక ఉత్సవం ‘ఆర్ట్ స్కేప్-25’ను విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు, లలిత, ప్రదర్శన కళల విభాగాధిపతి డాక్టర్ లలిత సింధూరిల సమక్షంలో ఈ ఉత్సవాన్ని గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రారంభించారు.
మొదటి రోజు విద్వాన్ డి.శ్రీనివాస్ ‘డివైన్ స్ట్రింగ్స్’ పేరిట నిర్వహించిన వీణా కచేరీ మంత్రముగ్ధులను చేసి, శుభారంభాన్ని అందించింది. ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన ‘మహాగణపతిం’ కీర్తనతో ప్రారంభమై, ఒక శుభప్రదమైన, ఉత్తేజకరమైన వాతావరణాన్ని నెలకొల్పింది. దీని తరువాత త్యాగరాజ ప్రసిద్ధ కీర్తనలైన ‘బ్రోవభారమా’, ‘నగుమోము’లను ఆలపించారు. ఇవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కచేరీకి వయోలిన్ పై దినకర్, మృదంగంపై రామకృష్ణ, ఘటంపై చంద్రకాంత్ సహకారం అందించి, ఈ ప్రదర్శనకు మరింత వన్నె తెచ్చారు.
రెండవ రోజు, విద్వాన్ ఆనందు మురళి కర్ణాటక గాత్ర కచేరీతో ప్రారంభమైంది. ఆయన గంభీర నటరాగంలో డాక్టర్ ఎం.బాలమురళీకృష్ణ స్వరపరిచిన పడవవర్ణంతో కచేరీని ప్రారంభించారు. వివిధ వాగ్గేయకారుల కూర్పులను ప్రదర్శిస్తూ, ఆయన శైలీపరమైన బహుముఖ ప్రజ్జను, సంగీత గాంభీర్యాన్ని ప్రదర్శించారు. సదాబహార్ ‘హరివరాసనం’తో ముగిసి, శాశ్వత ముద్ర వేసింది. మృదంగంపై విద్వాన్ టి.పి.బాలసుబ్రహ్యణ్యన్, వయోలిన్ పై విద్వాన్ కౌండిన్య ఆయనకు సహకరించారు.
దీని తరువాత, విద్వాన్ అంజు అరవింద్ అందించిన మనోహరమైన భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఆమె ప్రధాన అంశంగా ‘నవరసమోహన’ను, ఆ తరువాత ‘శ్రీరామచంద్ర కృపాలు’ భజనను ప్రదర్శించారు. ఆమె భావప్రకటనతో కూడిన అభినయం, లయబద్ధమైన నైపుణ్యం ఎంతగానో ప్రశంసలందుకున్నాయి. ఈ ప్రదర్శన పూర్వి రాగంలో తిల్లనాతో ముగిసి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది.
చివరి రోజు, దర్భా సోదరీమణులు- విద్వాన్ హరిణి, విద్వాన్ మృదురవళి అందించిన హృద్యమైన నేపథ్య గాత్ర ప్రదర్శనతో ప్రారంభమైంది. వారి ప్రదర్శన స్పష్టత, సౌందర్యాత్మక ఆకర్షణతో విభిన్న సంగీత ప్రక్రియలను ఆవిష్కరించింది. వారితో పాటు తబలాపై విద్వత్ సాయి కిరణ్, వేణువు-కీబోర్డుపై విద్వత్ సాయి రాఘవ సహకారం అందించారు.
విద్వత్ పి.బి.వైష్ణవి ఉత్సాహభరితమైన కూచిపూడి కచేరీతో ఆర్ట్ స్కేప్-25 ముగిసింది. ఆమె తిరుప్పావైని ప్రార్థనా రచనగా ప్రారంభించి, తరంగం ప్రధాన అంశంగా వ్యక్తీకరణతో కథ చెప్పడం ప్రేక్షకులను ఆకర్షించింది. కళాత్మక నైపుణ్యం, ఉత్సాహభరితమైన వేడుకగా ఆర్ట్ స్కేప్-25 నిలిచింది. విద్యార్థులలో సాంస్కృతిక వారసత్వం, సృజనాత్మక వ్యక్తీకరణను ప్రోత్సహించడంలో గీతం యొక్క నిబద్ధతను చాటిచెప్పింది.