24-12-2025 05:38:05 PM
హైదరాబాద్: నారాయణపేట జిల్లా కోస్గిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించి, కొత్తగా ఎన్నికైన సర్పంచులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీ చెప్పారని, గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పేదలకు పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాబులోకి వస్తుందని, గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని ప్రజాసేవ చేయాలని సర్పంచులకు సూచించారు.
కొడంగల్ ను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టిన నాయకులను సీఎం అభినందించారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కారించడానికి తన సోదరుడు తిరుపతి రెడ్డిని అందుబాటులో ఉంచానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాకు రోడ్డు పూర్తి చేస్తామన్నారు. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తామని, నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇక ఎలాంటి రాజకీయాలు లేవని, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే పార్టీలు, పంథాలు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనం అందరిని కలుపుకుని పోదామని, నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదని తెలిపారు.
నియోజకవర్గంలో చిన్నచిన్న ఘటనలను పక్కనపెట్టి పనిచేయాలని, గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, యాధావిధిగా వచ్చే నిధులు కాకుండా గ్రామాలకు ముఖ్యమంత్రి నిధి నుంచి గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు అదనంగా నిధులను ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రలతో సంబంధం లేకుండా ఇస్తామని తెలిపారు.