24-12-2025 05:53:59 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల అంశంపై ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ప్రభుత్వం నుంచి 3500 ఎకరాల విస్తీర్ణం లక్ష్యం నిర్దేశించబడిందని చెప్పారు.
కానీ సంబంధిత శాఖల అధికారులు సరైన విధంగా దృష్టి సారించకపోవడం కారణంగా లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి 5 ఎకరాల పైబడి భూమి కలిగి ఉండి బోరు సదుపాయం ఉండి, ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కలిగి ఉన్న రైతులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సదరు రైతులను గుర్తించి వారి జాబితాను ఉద్యాన శాఖకు అప్పగించాలని ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లో ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిచేయాలని ఆదేశించారు.
వరి కన్నా ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వారికి తెలియజేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తద్వారా రైతులు ఆ పంటకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రియునిక్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్న ఫ్యాక్టరీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని సదరు కంపెనీ అధికారులను కలెక్టర్ నిలాదీశారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయకపోతే రైతుల్లో సాగు చేసేందుకు భరోసా ఏ విధంగా కనిపించగలమని ప్రశ్నించారు.
త్వరితగతిన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా కంపెనీ యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా రైతులు రబీ సీజన్లో దొడ్డు రకం ధాన్యం వేయకుండా సన్న రకం ధాన్యానికి బోనస్ సదుపాయం ఉందని తెలియజేసి సన్న రకం వరి ధాన్యాన్ని సాగు చేసే విధంగా సూచనలు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఏడి దామోదర్, విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి, ఎంఏవోలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.