24-12-2025 05:43:18 PM
దట్టమైన వాయు కాలుష్యం, పొగతో 20 కి.మీ. మేర జనజీవనం ఉక్కిరిబిక్కిరి – ఈటల రాజేందర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దట్టమైన వాయు కాలుష్యం, విషపూరిత పొగ, భరించలేని దుర్వాసన కారణంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెత్త నుంచి వెలువడుతున్న విషవాయువులు దాదాపు 20 కిలోమీటర్ల పరిధి వరకు వ్యాపించి లక్షలాది మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని హెచ్చరించారు.
డంపింగ్ యార్డు నుంచి ఎడతెరిపి లేకుండా వెలువడుతున్న పొగతో పాటు దుర్వాసన వల్ల ఇళ్లలో కూర్చోవడం అసాధ్యంగా మారిందని అన్నారు. తలుపులు, కిటికీలు మూసుకున్నా ఊపిరాడని పరిస్థితి నెలకొందని, ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో పొగ తీవ్రత మరింత పెరిగి ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో నిండిన పగళ్లు ప్రజల దైనందిన జీవితంగా మారాయని తెలిపారు.
ఈ దట్టమైన వాయు కాలుష్యం ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పై తీవ్రంగా పడుతోందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. చిన్నపిల్లలు తరచూ దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నారని, వృద్ధులు ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కంటి మంటలు, తలనొప్పులు, వాంతులు, చర్మ సంబంధిత రోగాలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరగడం ప్రజలకు నిత్యక్రియగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చెత్త నుంచి కారుతున్న కలుషిత ద్రవాలు భూగర్భ జలాల్లో కలుస్తుండటంతో తాగునీరు పూర్తిగా విషపూరితంగా మారిందని తెలిపారు. నీటిని తాగలేని, వంటకు ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. వ్యవసాయ భూములు కలుషితమై పంట దిగుబడులు తగ్గిపోయాయని, రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో భూములు, ఇళ్ల విలువలు భారీగా పడిపోవడంతో ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోలేని దుస్థితిలో చిక్కుకున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితులన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలను పూర్తిగా విస్మరించి డంపింగ్ యార్డు కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం, జీవితం, భవిష్యత్తును పణంగా పెట్టి చెత్త రాజకీయాలు ఆడటం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే ఈ డంపింగ్ యార్డును వెంటనే తొలగించడమే ఏకైక పరిష్కారం అని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ప్రాంతంలో శాస్త్రీయ విధానాలతో చెత్త నిర్వహణ చేపట్టి ప్రజలకు శాశ్వత ఉపశమనం కలిగించాలని సూచించారు. సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం లభించే వరకు తాను ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.