08-08-2025 02:14:27 PM
హైదరాబాద్: పెరుగుతున్న ఆందోళనల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని రద్దు చేయడం ద్వారా గిగ్ వర్కర్లు, ప్రైవేట్ రంగ డ్రైవర్లు, అసంఘటిత రంగంలోని ఇతరులకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(Kalvakuntla Taraka Rama Rao) ఆరోపించారు. రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను క్లియర్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విఫలమైతే, డ్రైవర్ల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, ఈ అమానుష ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనను మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) పాలనతో పోల్చి చూస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, నేత కార్మికులు, డ్రైవర్లకు బీమాను అందించిందన్నారు. ఎన్నికలకు ముందు అసంఘటిత రంగ కార్మికులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 అక్టోబర్ నుండి ఆ పథకాన్ని ఉపసంహరించుకున్నారని, ప్రమాద బాధితుల కుటుంబాలకు మద్దతు లేకుండా పోయిందని కేటీఆర్ మండిపడ్డారు. మానవతా దృక్పథం గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్, వాస్తవానికి పేద డ్రైవర్ల కుటుంబాలను కష్టాల్లో వదిలేసిందన్నారు. రైతు బీమా, నేతన్నకు బీమా, డ్రైవర్లకు బీమా వంటి ఎన్నో పథకాలతో సబ్బండ వర్ణాల ప్రజల భవిష్యత్తుకు కేసీఆర్ ధీమా అందిస్తే.. ఒక్కో పథకానికి మంగళం పాడి పేద కుటుంబాల భవిష్యత్తును ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తోందన్నారు.