30-09-2025 07:02:52 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల..
వనపర్తి (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సెర్ప్, మెప్మా, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల హాజరయ్యారు. తీరొక్క పువ్వులతో ముస్తాబు చేసిన బతుకమ్మ ప్రతిమలకు కలెక్టర్, ఎస్పీ పూజలు చేసారు. బతుకమ్మ చుట్టూ మహిళలు, చిన్నారులు బొడ్డెమ్మలు వేసి ఆడిన ఆటలు ఎంతో ఆకర్షించాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సైతం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ అని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన వనపర్తి జిల్లాలో బతుకమ్మ సంబరాలు వాడ వాడల ఘనంగా జరుగుచున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా, ఉత్తమ బతుకమ్మ వేడుకలు ప్రదర్శించిన వారికి బహుమతులను జిల్లా కలెక్టర్, ఎస్పీ బహూకరించారు. మొదటి బహుమతి మెప్మా మహిళా సమాఖ్యకు దక్కగా, రెండో బహుమతి పురపాలక శాఖ, మూడో బహుమతి వ్యవసాయ శాఖ, నాలుగో బహుమతి కలెక్టరేట్కు దక్కింది. బతుకమ్మ వేడుకల్లో వివిధ జిల్లా శాఖల అధికారులు, మహిళలు, చిన్నారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.