30-09-2025 07:24:28 PM
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్
కాటారం (విజయక్రాంతి): కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ జోడు శ్రీనివాస్ అరెస్టుపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ విచారణ చేపట్టాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. మంగళవారం కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో గల అంబేద్కర్ చౌరస్తాలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, పలిమేల, మలహర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో పోలీసులు ఖాకి దుస్తులు ధరించిన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసుల కంటే, అదే ఖాకీ దుస్తులు ధరించిన సఫాయి కార్మికులు నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, అక్కడే ఉన్న సఫాయి కార్మికుడు వెంకట్ కి శాలువా కప్పి సన్మానం చేశారు. జోడు శ్రీనివాస్ ను అర్ధరాత్రి అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.