calender_icon.png 30 September, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లపై పునఃసమీక్ష చేయాలి: ఎస్సీ నాయకుల డిమాండ్

30-09-2025 07:29:30 PM

దేవరకొండ (విజయక్రాంతి): దేవరకొండ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల అమలులో షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీలకు) తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దేవరకొండ మండల కేంద్రంలోని ఐబీ బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D, 73వ సవరణ ప్రకారం ఎస్సీలకు కేటాయించాల్సిన 15 శాతం రిజర్వేషన్లను అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, ఇది స్పష్టమైన వివక్ష అని ఆరోపించారు. అధికారులు వెంటనే ఈ రిజర్వేషన్లను పునఃసమీక్షించి, ఎస్సీలకు న్యాయం చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

గత రెండు దశాబ్దాలుగా దేవరకొండ నియోజకవర్గంలో ఎస్సీలకు రాజకీయంగా సరైన అవకాశాలు కల్పించడం లేదనేది వాస్తవమని నాయకులు పేర్కొన్నారు. 1962లో దేవరకొండ ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎస్సీలకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. అలాగే, నాలుగు మండలాల్లో మండల పరిషత్ (ఎంపీపీ), జిల్లా పరిషత్ (జడ్పీటీసీ) స్థానాల్లోనూ ఎస్సీలకు అవకాశాలు లేకుండా చేసిన అధికారుల తీరును వారు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు డాక్టర్ యేకుల రాజారావు, మాల మహానాడు దేవరకొండ డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్, నల్ల వెంకటయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.