30-09-2025 07:39:51 PM
గౌడ్ గాం గ్రామాన్ని ముంచేతిన మంజీరా వరద
జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామం
జిల్లా నుంచి తెగిపోయిన రాకపోకలు
అర్థరాత్రి ఎమ్మెల్యే సందర్శన
బీదర్ జిల్లాలోని కందుగుల్ ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు
నాగల్ గిద్ద: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం గౌడ్ గాం జన్వాడ గ్రామం మంజీర నది వరద ముంచెత్తింది. గ్రామానికి జిల్లాకు రహదారి తెగిపోయింది. జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని అధికారులు సోమవారం రాత్రి పునరావాస కేంద్రాలు కర్ణాటక రాష్ట్రంలోని కందుగుల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో వృద్ధులకు, చిన్న పిల్లలను తరలించారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో గ్రామాన్ని సందర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని తెలిపారు.
ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి రోడ్డుపై అధిక నీరు రావడంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వెళ్ళి గ్రామాన్ని సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంజీర నది ఉద్రిక్తంగా మారడం ఇదే మొదటిసారని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి భరోసా కల్పించారు. వారితో పాటు మండల ఎంపీడీవో మహేశ్వర రావు, తహసిల్దార్ శివకృష్ణ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, మండల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.