30-09-2025 07:34:10 PM
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని దుర్గగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఈ రోజు భద్రకాళీ జన్మోత్సవం. కృష్ణాష్టమి వలెనే ఈ రోజు రాత్రి కూడా అమ్మవారికి విశేష అభిషేక అర్చనాదులు, జపహోమలు జరుపుతున్నారు. దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో 27వ అధ్యాయం 9వ శ్లోకం అనుసరించి పురాష్ట్రమ్యామ్ భద్రకాళీ దక్షయజ్ఞ వినాశినీ ప్రాదుర్భుతా మహా ఘోరా యోగినీ కోటి బిస్సహా దీని అర్ధం దుర్గాస్టామి అనబడే మహాస్టమి రోజున దుర్గ కోటి యోగిని గణములతో భద్రకాళీగా ప్రదుర్భావమ్ చెందిన రోజు ఈ మహాస్టమి. యావధ్భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడైనా దేవీ నవరాత్రా వ్రతం చేసే సకల జనులు శాస్త్ర వచనం మేరకు ఈ రోజు అందరూ అమ్మవారిని భద్రకాళిగానే పూజిస్తారు.
భద్రకాళీ విశ్వమంతా వ్యాపించి వున్నాభూమండలం మీధ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా ప్రసిద్ది చెందిన తెలంగాణలోనే వరంగల్ మహానగరంలో దుర్గాస్టామినాడు కోటి యోగినీ గణములతో అవతరించడం వల్ల ఈ వరంగల్ మహానగరం ఒక పవిత్రతను సంతరింపచేసుకున్నది. అందుకే ఈ రోజు స్త్రీలందరూ అమ్మవారికి చద్దులు చేసి నివేదించడంలోని నేపథ్యం. ఇదే చద్దుల బతుకమ్మ పండుగ అయింది. ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణాలో మాత్రమే ఎందుకు ఉందంటే తెలంగాణలో స్వయం వ్యక్తమైన దేవాలయం భద్రకాళీ దేవాలయం కావున ఆ విశ్వ వ్యాప్తమైనా జగన్మాత దుర్గాస్టామినాడు ఈ భూమండలం మీద కోటి యోగిని గణములతో భద్రకాళీగా అవతరించిన ప్రదేశం తెలంగాణలోని నాటి ఏకశిలా నగరం నేటి వరంగల్ మహానగరం అయినందున భద్రమ్మ, బతుకమ్మ, భద్రేశ్వరి, భద్రకాళి పేర్లతో విశేషంగా తెలంగాణ మొత్తం ఆరాదింప బడుతుంది.
కాకతీయుల కాలం నుండి కూడా ఈ బతుకమ్మ స్త్రీలు చేసే దుర్గారాధన మనకు చరిత్ర చెబుతుంది. కాబట్టి దుర్గాస్టామినాడు లక్షలాది స్త్రీలు ఆబాల గోపాలం బతుకమ్మకు చద్దులు చేస్తారు. బతుకమ్మ భద్రమ్మ వేరే కాదు ఒక్కటే. ఈ రోజు వేలాది మంది స్త్రీలు దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. ఈ రోజు ఉదయం అమ్మవారికి విమానక సేవ, సాయంకాలం సర్వభూపాల సేవలు జరిపారు. అమ్మవారిని మేన ఎక్కించి అట్టి మీనాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మోస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు తద్వారా ఇట్టి సేవను దర్శించడం వల్ల సత్సంతానం అధికారం విద్య తెలివితేటలు సమకూరుతాయి సర్వభూపాల వాహన సేవలో అమ్మవారిని వేంచేపు చేసి అష్టదిక్పాలకులు మోస్తూ అమ్మవారిని సేవిస్తారు. ఈ సేవను దర్శించడం వల్ల సర్వతోముఖవిజయ ప్రాప్తి కలుగుతుందని ఆలయప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు.
మంగళవారం అమ్మవారి విశేష అలంకరణకు గండ్ర భూపాల్ రెడ్డి రూపా దంపతులు గండ్ర అభిలాష్ రెడ్డి దివ్య దంపతులు గండ్ర సాయి కృష్ణారెడ్డి భావనాంజలి దంపతులు, భారతి విద్యా సంస్థల అదినేతలు ఇరుకుళ్ళ సంజయ్ కుమార్-జయశ్రీ దంపతులు, డాక్టర్ పోతాని రాజేశ్వరప్రసాద్, డాక్టర్ లలితా దేవి దంపతులు కాపర్తి వీర వెంకటయ్య, బాలకృష్ణ వేణి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. పూజనంతరం ఉభయదాతలకు ఆలయ ఈ.ఓ రామల సునీత శేష వస్త్రములు బహుకరించి ప్రసాదములు ఆందజేశారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ కె ఎన్ సంధ్యారాణి తదితరులు ఉన్నారు. ఆలయానికి విచ్చేసిన డిప్యూటీ కమిషనర్ కు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూజానంతరం మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి ప్రసాదములు అందజేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ నవరాత్రుల ఏర్పాట్లను పరిశీలించారు. సాయంకాలం దేవాలయ ప్రాంగణంలో అనేకమంది మహిళలు బతుకమ్మను ఆడారు.