6 August, 2026 | 9:09 PM

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి

06-08-2026 07:57 PM

- ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు

టేకులపల్లి,(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచి వంశీకృష్ణ పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలో గురువారం సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల మండల సదస్సు కడుదుల వీరన్న అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రజా సంపదను ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాల్లో చేసిన మార్పులతో ఎనిమిది గంటల పని హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులకు భంగం కలుగుతోందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

అమెరికాతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశ రైతాంగానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు, కోడి కాళ్ల దిగుమతులకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే చర్యలను విరమించుకోవాలని, కొత్తగా తీసుకొచ్చిన VBGRAM-G చట్టంతో పాటు నూతన విత్తన, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా నిర్వహించే "జైల్ భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఈసం నరసింహారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి జినక బాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు మజహరి, సంఘ నాయకులు చింత రమేష్, రాంబాయి, ఇర్ప నాగమ్మ, నాలి శేఖర్, మూడ్ శోభన్, అచ్చమ్మ, పూనెం సుమలత తదితరులు పాల్గొన్నారు.