6 August, 2026 | 10:10 PM

భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు

06-08-2026 09:08 PM

నాగల్‌గిద్ద,(విజయ క్రాంతి): నారాయణఖేడ్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నాగల్‌గిద్ద మండలం గూడూరు గ్రామంలో భూసార పరీక్షల సిఫారసు మేరకు రసాయన ఎరువుల వినియోగం, అనువైన వంగడాల ఎంపిక, సస్యరక్షణ చర్యలు, ఎల్‌నినో వాతావరణ ప్రభావాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్ కుమార్ మాట్లాడుతూ... భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వినియోగించాలని, అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

అనంతరం కేవీకే శాస్త్రవేత్త రమేష్ సోయాబీన్, అపరాలు, చెరుకు పంటల యాజమాన్య పద్ధతులు, ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనే సాగు విధానాలు, నూతన వంగడాల ఎంపిక, సస్యరక్షణ చర్యలు, ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతపై రైతులకు వివరించారు. అనంతరం పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు పంటల పరిస్థితిని పరిశీలిస్తూ తగిన సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో గూడూరు, కేశ్వార్ గ్రామాల సర్పంచులు జగన్నాథ్, మాదేవి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, ఏఈవోలు వినయ్, సంతోష్, రాందాస్, బీటీఎం మారుతి రెడ్డి, పెద్ద రాంరెడ్డి, మాణిక్ రెడ్డి, శివరాజ్, సంగన్న టీచర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.