ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భావజాల వ్యాప్తికర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జయశంకర్ దిశానిర్దేశం చేశారని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యపరిచారన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అధికారులందరూ ఆయన స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, డిఆర్ఓ స్రవంతి, ఏవో వర్ణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి డి. సోనియా, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






