6 August, 2026 | 10:04 PM

మోర్గి మోడల్ పాఠశాల, కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

06-08-2026 09:03 PM

- లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సర్పంచ్ మల్గే అన్నపూర్ణ శివశరణప్ప పిలుపు

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల పరిధిలోని మోర్గి తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ఆహ్వానించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్గే అన్నపూర్ణ శివశరణప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితానికి బలమైన పునాది అని, స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని అన్నారు.

క్రమశిక్షణ, సమయపాలన, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే సంకల్పంతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక, వినోదాత్మక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. కళాశాల ఆవరణ విద్యార్థుల సందడి, చప్పట్లతో ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.