ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి
వాంకిడి (విజయక్రాంతి): ఈనెల ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం దినాకర్ పిలుపునిచ్చారు. గురువారం వాంకిడి హమాలీ కార్యాలయం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని ఆరోపించారు.
వాటిని రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






