03-08-2025 12:16:08 AM
భారతదేశంలో బీసీల రిజర్వేషన్ల వివాదాలు దశాబ్దాలుగా ఉ న్నాయి. 1994లో 243(డి)(టి) అధికరణ ల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఆ త ర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థ ల్లో బీసీలకు కల్పిస్తున్న 34 శాతం రిజర్వేషన్లు కాస్తా.. 2019లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో 23 శాతానికి తగ్గాయి.
ఈ నేపథ్యంలో 2023 తెలంగాణ రాష్ర్ట శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన కా మారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీనిచ్చింది. ఆ హామీని నెరవేర్చే క్రమంలో ప్రస్తుతం ఎదురవుతు న్న అడ్డంకులపై రాష్ర్టవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ వల్లే బీసీ రిజర్వేషన్ల అమ లు ఆలస్యమవుతూ వస్తోందని హస్తం నా యకులు ఆరోపిస్తుండగా.. అసలు బీసీల పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి అనేదే లేదని బీజేపీ నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే రగడ కొన సాగుతోంది.
అడ్డంకులు.. అవరోధాలు
చట్టసభల్లో బీసీలకు ఎలాగూ రిజర్వేషన్లు లేవు. కనీసం స్థానిక సంస్థల్లో అయి నా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఆ ప్ర క్రియకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. 1994లోనే స్థానిక సంస్థల్లో బీసీ లకు రిజర్వేషన్లు కల్పిస్తున్న సందర్భంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకి 33 శా తం రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు.
బీసీలకు ఒక నిర్దిష్ట శాతం అనేది నిర్ణయించకుండా రిజర్వేషన్ల కోటాని 50 శాతానికి మించకుండా నిర్ణయించే బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేశారు. దీంతో ఆ నాటి నుంచి నేటి వరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. రాజకీయంగా కొన్ని అవ రోధాలు దాటినా.. శాసనపరంగా, న్యాయపరంగా వచ్చే అడ్డంకులు బీసీ రిజర్వేషన్ల బండిని ముందుకు సాగనీయడం లేదు.
బీసీ రిజర్వేషన్ల పెంపుకి కోర్టు కేసులు తీ ర్పులు కూడా అవరోధంగా మారుతున్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. 1992లో ఇందిరా సాహిని కేసులో వెలువడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించరాదనే నిబంధన బీసీ రిజర్వే షన్ల పెంపుకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇటీవల బీహార్ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో కులగణన తర్వాత ఆ రాష్ర్టంలో బీసీల రిజర్వేషన్లను 33 శాతం నుంచి 43 శాతానికి పెంచింది.
ఈ పెంపుతో మొత్తం రిజర్వేషన్ల పరిధి 65 శాతానికి పెరిగిపోయింది. దీంతో రిజర్వేషన్ల పెంపు నిర్ణయా న్ని పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యతిరేకించాయి. కోర్టులు కన్నెర్ర చేయడంతో రిజర్వేషన్ల పెంపు ప్రక్రియకు బ్రేక్ పడింది. రిజర్వేషన్ల పెంపుకి మరీ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపుకి 50 శాతం పరిమితి అ డ్డుగోడగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడు తున్నారు.
ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పా టు చేసి కమిషన్ సిఫారసుల మేరకు బీసీ ల వెనుకబాటుతనం అధ్యయనం చేసి ట్రి పుల్ టెస్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ని ర్ణయించాలని 2010లో కృష్ణమూర్తి వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆయా రా ష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు మరింత ప్రమాదంలో పడ్డాయి.
2021లో వికాస్ కిషన్‌రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట కేసులోనూ.. 2022లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులోనూ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కోటాని నిర్ణయించాలని కోర్టు లు తీర్పు చెప్పాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటా నిర్ణయం లో రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రిజర్వేషన్లు సాధించే మార్గమేది?
రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించి ఆమోదం కోసం రాష్ర్ట పతికి పంపింది. అయినా బిల్లు ఆమోదంలో జాప్యం జరుగుతుండటం రాష్ర్టప తి నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటం వల్ల 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని 285 (ఏ) క్లాస్‌ని సవరించి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిం చి సవరణ ప్రతిపాదనను గవర్నర్‌కు పం పారు.
న్యాయసలహా కోసం గవర్నర్ ఆ సవరణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు పంపిన నేపథ్యంలో రిజర్వేషన్ల సాధన మ రింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క రిజర్వేషన్లు సాధించే క్రమంలో ప్రభుత్వం రూపొందించిన బీసీ రిజర్వేషన్ల బిల్లులో అనేక తప్పులు ఉన్న ట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల సాధన కోసం బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు బలహీనంగా ఉండటం ప్రధాన లోపంగా కనిపిస్తుంది.
తమిళనాడులో బీసీలకి కల్పిస్తున్న 31 శాతం రిజర్వేషన్లని 11 కులాలే అనుభవించాయి బీసీల్లోని కింది కులాలకి కూడా న్యాయం జరగాలంటే బీసీలను నాలుగు వర్గాలుగా విభజించి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1983లో అంబా శంకర్ కమిషన్ సిఫారసులు చేసింది. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఆనాటి భారత ప్రధాని పీవీ నరసింహారావుని ఒప్పించి..
అంబా శంకర్ కమిషన్ సిఫారసులు 9వ షెడ్యూల్‌లో పెట్టించిన తీరును నేటికీ బీసీలు గు ర్తు చేసుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా 2600 ఓబీసీ కులాలుండగా.. వాటిల్లో 25 శాతం కులాలే 97 శాతం అవకాశాలు దక్కించుకున్నాయని ఓబీసీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ రో హిణి కమిషన్ రిపోర్ట్ బయటపెట్టింది. తె లంగాణ ప్రభుత్వం రూపొందించిన బీసీ రిజర్వేషన్ల బిల్లులో ఈ రిపోర్టుని రిఫరెన్స్‌గా వాడుకొని ఉంటే బాగుండేది.
తె లంగాణలో కూడా బీసీలకు స్థానిక సంస్థలల్లో కల్పించిన 34 శాతం రిజర్వేషన్లని 10 నుంచి 15 కులాలే ఉపయోగించుకున్నాయి. తెలంగాణలో మొత్తం 134 బీసీ కులాలుండగా.. వారిలో 80 కులాల వారి కి ఇప్పటివరకూ పంచాయతీ ప్రెసిడెంట్ పదవులు కూడా దక్కలేదు. ఇటువంటి రాజకీయ వెనుకబాటుతనాన్ని రిజర్వేషన్ల బిల్లులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పొందుపరచలేకపోయిందని అంతా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నియమిం చిన వెం కటేశ్వరరావు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ సిఫారసులతో రిజర్వేషన్లు ఎలా సాధించగలుగుతారు.
సామాజిక, ఆర్థిక, వి ద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని బీసీ తరగతుల్లో వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని.. విద్యా, ఉపాధి, రాజకీయ ప్రాతినిథ్యంలో ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటాని సిఫారసు చేస్తున్నామనే బలహీన వాదన తో రిజర్వేషన్లు సాధించడం ఎలా సాధ్య మవుతుందనేది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.
వెనుకబాటుతనం వివరించలే..
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బీసీ రిజర్వేషన్ల బిల్లులో బీసీల వెనుకబాటుతనం గురించి సరైన వివరణ ఇవ్వనట్టు ప్రచారం జరుగుతున్నది. బీసీల వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ప్రభుత్వం సరిగ్గా చెప్పలేకపోయిందనే వాదనలు ఉన్నాయి. రిజర్వే షన్లు ఎందుకు పెంచుతున్నామో, బీసీల వెనుకబాటుతనం ఎలా ఉందో బిల్లులో స్పష్టం చేసినపుడే రిజర్వేషన్ల సాధన సా ధ్యం అవుతుంది.
రిజర్వేషన్ల పెంపు ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనానికి సంబంధించిన అంశం కాబట్టి రాజకీయ పార్టీలన్నీ.. దీనిని ఒక రాజకీయ సమస్యగా మార్చకుండా రిజర్వేషన్ల సాధనకు సహకరిస్తేనే కోటా సాధ్యమవుతుంది. రిజర్వేషన్లకు సహకరించని పక్షంలో ఆయా పార్టీలపై బీసీల వ్యతిరేకిగా ముద్రపడే అవకాశాలూ లేకపోలేదు.