03-08-2025 09:54:47 AM
హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్(Narayanaguda Police Station) పరిధిలోని హిమాయత్ నగర్‌లో విషాదం నెలకొంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక గృహిణి మూఢనమ్మకాల కారణంగా తన అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపారవేత్త అరుణ్ కుమార్ జైన్, అతని భార్య పూజ జైన్(43) హిమాయత్ నగర్‌లో నివసిస్తున్నారు.
వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పూజ గత ఐదు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఇటీవల, ఆమెకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. అరుణ్ కుమార్ నిన్న తన కార్యాలయానికి వెళ్ళిన తర్వాత... ఇంట్లో పిల్లలు , పనిమనిషి ఉన్నారు. మధ్యాహ్నం వరకు తన గదిలో ఒంటరిగా కూర్చున్న పూజ, ఊహించని విధంగా ఐదవ అంతస్తు నుండి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడ్డ పూజను వెంటనే ఆసుపత్రికి తరలించారు, అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.
సూసైడ్ నోట్‌లో షాకింగ్ వివరాలు
ఆత్మహత్యకు ముందు పూజ కూర్చున్న గదిలో ఒక లేఖ కనుగొనబడింది. "మీరు నిరంతరం ధ్యానం చేసి దేవునికి అంకితం చేస్తే, మీరు దేవునికి దగ్గరగా ఉంటారు మరియు స్వర్గాన్ని పొందుతారు" అని ఒక జైన గురువు చెప్పిన విషయాన్ని ఆ లేఖ ఉటంకించిందని పోలీసులు తెలిపారు. ఈ లేఖ, మూఢనమ్మకాలతో పాటు ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.