16 August, 2026 | 1:00 AM

నల్సార్ వివాదంపై బీసీఐ క్షమాపణలు

16-08-2026 12:00 AM

సీజేఐ మందలింపుతో కదలిక

న్యూఢిల్లీ, ఆగస్టు 15: నల్సార్ వివాదంపై తన మాటల ద్వారా గానీ, లేఖల ద్వారా గానీ న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉండొచ్చని బీసీఐ చైర్‌పర్సన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు కోరారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘యువ మిత్రులకు’ రాసిన లేఖలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తన వ్యాఖ్యలపై మిశ్రా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు కోరడానికి ఏ మాత్రం సంకోచించకూడదని, విచారం వ్యక్తం చేయడం అనేది పరువు కోసమో, అహంకారం కోసమో కాదని అన్నారు. విద్యార్థుల మనోభావాలను గౌరవిస్తున్నానని, వారి ఆందోళనలకు విలువ ఉందని అంగీకరించడమేనని మిశ్రా పేర్కొన్నారు.

ఇక ఈ విషయానికి రాజకీయ రంగు పులమవద్దని కోరారు. నల్సార్ వార్షికోత్సవం సందర్భంగా సీజేఐ పర్యటనను విద్యార్థులు వ్యతిరేకించారు. దీనిపై బీసీఐ చైర్మన్ కల్పించుకొని న్యాయ విద్యార్థులకు రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లో చేర్పించుకోవద్దని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీంతో మరోమారు విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఒకరోజు ముందు సీజేఐ సూర్యకాంత్ మనన్ కుమార్ మిశ్రాను మందలించారు. దీంతో ఆయనలో కదలికొచ్చి బహిరంగ క్షమాపణలు కోరారు.