16 August, 2026 | 1:00 AM

ఎస్‌ఐ చెంప చెల్లు

16-08-2026 12:00 AM

కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దురుసు ప్రవర్తన 

బెంగళూరు, ఆగస్టు 15: కర్ణాటకలోని తమకూరు ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె, ఐపీఎస్ అధికారి భార్య ఐశ్వర్య ఒక మహిళా ఎస్‌ఐ చెంప చెల్లుమనిపించారు. దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఆమెకు దర్శనంలో జాప్యం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న మహిళా ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగి దాడి చేశారనే ఆరోపణలున్నాయి. శనివారం తమకూరులోని ‘ఆరతి ఉక్కడ’ ఆలయం బీమా అమావాస్య వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కుమార్తె ఆలయానికి వెళ్లారు.

క్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐ సవితా పాటిల్‌ను తనను ఆలయంలోకి పంపించాలని దబాయించారు. ఆ ఎస్‌ఐ ససేమిరా అనడంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన ఐశ్వర్య ఆమె చెంపపై కొట్టారు. దీన్ని చూసిన మిగతా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐశ్వర్య దాడిపై ఎస్‌ఐ క్యాతనహల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇంతవరకూ ఆమెను అరెస్టు చేయకపోవడం, కనీసం గాలింపు చర్యలు చేపట్టకపోవడం విశేషం.

కాగా ఈ సెక్షన్లన్నీ నాన్ బెయిలబుల్ కావడంతో ఎమ్మెల్యే సురేష్ గౌడ క్షమాపణలు చెప్పారు. తన కుమార్తెను మహిళా ఎస్‌ఐ దూషించారని ఆరోపించారు. గర్భగుడిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదన్నారు. కానీ ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌ను అనుమతించారని, దీన్ని ప్రశ్నించిన ఐశ్వర్యతో ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడిందన్నారు. కాగా తన కుమార్తె అధికారిని కొట్టిన చెంపదెబ్బ వీడియో తాను చూడలేదని, ఏది ఏమైనా జరిగినదానికి క్షమాపణలు చెబుతూ చింతిస్తున్నానని అన్నారు. కాగా ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది. కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.