calender_icon.png 11 May, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మతనం అడ్డేం కాదు!

11-05-2025 12:26:14 AM

సేవ చేయడానికి అమ్మతనం అడ్డేం కాదని నిరూపిస్తున్నారు మన హీరోయిన్లు. ‘వాళ్లకేం మహారాణులు. ఇంట్లో ఉంటే అద్దాల మేడల్లో ఉంటారు. షూటింగ్ జరిగితే ఓబీ వ్యాన్‌లలో సేద తీరతారు. ఏ కష్టం తెలియదు. ఇక సమాజం గురించి ఏం పట్టించుకుంటారు?’ అనుకుంటాం. అది పొరపాటు అని నిరూపిస్తున్నారు ఈ హీరోయిన్లు. సమాజహితం కోరే తమదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పట్టిచూపే బోలెడు మంచి పనులు చేస్తున్నారు.. 

ప్రియాంక..

మిస్‌వరల్డ్ గెలుచుకున్నప్పుడే ప్రపంచ దేశాల సుందరి అయ్యింది. అమెరికాలో ప్రాచుర్యం పొందిన టీవీ సీరిస్ క్వాంటికోలో నటించి.. ఏకంగా గ్లోబల్ పాపులారిటీ సంపాదించింది ప్రియాంక. ఆ అంతర్జాతీయ గుర్తింపును సేవ వైపు మళ్లించింది. యూనిసెఫ్ తరపున పలు దేశాల్లో పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నది. పురుషాధిక్యతపై నిరసన గళం వినిపిస్తున్నది. మహిళా వివక్షను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. 

దీపిక స్వచ్ఛంద సంస్థ

ఏదీ దాచుకోదు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుం ది. చిన్న జబ్బు వచ్చిందని బయటికి తెలిస్తే.. తమ స్టేటస్ ఎక్కడ తగ్గిపోతుందనో ఆందోళన చెందే సెలబ్రిటీలకు ఆమె ఒక ప్రేరణ. కొన్నేళ్ల కిందట డిప్రెషన్‌తో తనెంత బాధపడిందీ మొహమాటం లేకుండా చెప్పేసింది. మానసిక రుగ్మతల నిర్మూలన కోసం పూనుకుంది. అందులో భాగమే ‘లివ్ లవ్ లాఫ్’. దీపిక ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తుంది. వేల మంది బాధితులకు సహాయపడింది. 

అలియా జంతుప్రేమ

ఇతరులు ప్రేమ చూపిస్తే ఆమె మంచుకొండలా కరిగిపోతుంది. తను కూడా అంతే.. అందర్నీ ప్రేమగానే చూస్తుంది. మనసు అంత సున్నితం.మనసుల పట్లే కాదు, జంతువులపై కూడా ఆమెది అదే ప్రేమ. ‘పెటా’ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ప్రత్యేక ఫోటో షూట్‌లకు పోజ్ ఇస్తుంది. వీధుల్లో తిరిగే జంతువులకు కష్టం కలిగించొద్దు. వాటిని సమభావంతో చూడాలి అంటూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నది. 

రాధికాఆప్టే, మీటూ

ఆమె ఆలోచన ఎంత ప్రోగ్రెసివ్‌గా ఉంటుందం టే.. ఆఖరికి నటన కూడా ఒకే భాషలో కేంద్రీకృతం కాకూడదన్నది రాధికా ఆప్టే భావన. అందుకే హిందీతో పాటు మరాఠీ, తమిళం, మళయాలం, తెలుగు, బెం గాలీ, ఇంగ్లిషు.. ఇలా ఎన్నో భాషల్లో నటించింది. ఓటీటీ ప్లాట్‌ఫాం పుంజుకుంటున్న దశలో వెబ్‌సీరిస్‌లలోనూ ఆమె వైవిధ్యమైన నటన ప్రదర్శిస్తోంది. ఈ తరహా ప్రయాణం కేవలం కెరీర్‌కే పరిమితం కాలేదు. సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ అవే ప్రగతిశీల భావాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. లైంగిక వివక్షపై పోరాడుతుంది. మరోవైపు ‘మీటూ’ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొంది. 

సోనమ్ ‘ఎల్‌జిబిటి’

బాలీవుడ్‌లో ఫ్యాషన్ క్వీన్ ఎవరైనా ఉన్నారంటే.. ఆమె సోనమ్ కపూరేనని చెప్పొచ్చు. అందచందాల్లోనే కాదు.. ఆత్మాభిమానం కోసం ఆరాటపడే మనిషి. అందరూ చిన్నచూపుచూసే ఎల్‌జిబిటిలలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తోంది. మహిళలను వేధించే బ్రెస్ట్ క్యాన్సర్‌పై కూడా అవగాహన కల్పిస్తోంది. ఒక క్యాన్సర్ ఫౌండేషన్ కూడా నెలకొల్పింది. తను ధరించిన దుస్తులను వేలం వేసి.. వచ్చిన డబ్బును స్వచ్ఛంద సేవకు వినియోగిస్తున్నది సోనమ్.