calender_icon.png 12 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మలకు సలాం!

11-05-2025 12:20:56 AM

రంగం ఏదైనా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మగాళ్లకే పరిమితం అనుకున్న అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారు. నిర్మాణరంగంలో మన తల్లుల కృషి అనిర్వచనీయం. ఈరోజు మదర్స్‌డే సందర్భంగా నిర్మాణరంగంలో విజయాలు అందుకున్న మన అమ్మలకు సలాం.. 

భారతదేశ నిర్మాణ రంగం వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పనలో రెండో స్థానంలో ఉన్నది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదీ ఒకటి. ఈ రంగం భారతదేశ జీడీపీ పెరుగుదలకు కూడా గణనీయంగా దోహదపడుతుంది. అయితే, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, నిర్మాణ పరిశ్రమలు పురుషాధిపత్యంలో ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే కాలక్రమేణా మహిళా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, సివిల్ ఇంజినీర్ల సంఖ్య కూడా బాగా పెరుగుతున్నది. 

చిత్ర విశ్వనాథ్

చిత్ర విశ్వనాథ్ నైజీరియా నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, అహ్మదాబాద్‌లోని సీఈపీటీ విశ్వ విద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీని పొందారు. పర్యావరణ అనుకూల నిర్మాణాలు, డిజైన్‌లు చేయడంలో ఈమె దిట్ట. 

బృందా సోమయ

బృందా సోమయ ముంబై విశ్వవిద్యాలయంలోని సర్‌జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీని అందుకున్నారు. ఈమె 40 సంవత్సరాల వ్యవధిలో 200కి పైగా ప్రాజెక్టులను నిర్మించారు. ప్రస్తుతం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2004లో ముంబైలోని సెయింట్ థామస్ కెథడ్రల్ పునరుద్ధరణకుగానూ ఆమెకు యునెస్కో ఆసియా హెరిటేజ్ అవార్డు లభించింది. 2007లో వీనర్‌బెర్గర్ గోల్డెన్ ఆర్కిటెక్ట్ అవార్డు అందుకున్నారు. 

శిముల్ జావేరి కద్రి

శిముల్ జావేరి కద్రి ముంబైలోని అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్ డిగ్రీ పట్టాను పొందారు. మిచిగావ్ విశ్వవిద్యాలయం నుంచి అర్బన్ ప్లానింగ్ పట్టా పొందారు. ఈమె డిజైన్లలో ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాగే భారతీయ సంస్కృతిని ప్రతిబింబిచేలా కూడా ఉంటాయి. శిముల్ జావేరి కద్రి వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ ప్రైజ్ 2012, ఫ్యూచురార్క్ గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2012, ప్రిక్స్ వెర్సైల్లెస్ అవార్డు 2016, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నుంచి పలు అవార్డులు పొందారు. 

అభా నారాయణ్ లంబా

అభా నారాయణ్ లంబా భారతీయ పురాతన కట్టడాల పరిరక్షణకు పనిచేస్తున్నారు. ఆమె న్యూ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, బిల్డింగ్ రిస్టోరేషన్, మ్యూజియం డిజైన్‌లో ఈమెకు ప్రావీణ్యం ఉన్నది. అజంతా గుహలు, గోల్కొండ కోట, మహాబోధి దేవాలయం వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణకు కృషి చేస్తుంది. 

సోనాలి రస్తోగి

సోనాలి లండన్‌లోని ఆర్కిటెక్చరల్ అసోసియేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈమె తన భర్తతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు సముదాయమైన సూరత్ డైమండ్ బోర్స్‌ను నిర్మించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఈ భవనాలను తీర్చిదిద్దారు. 

అనుపమ కుండూ

అనుపమ కుండూ 1967లో పూణెలో జన్మించారు. ఆమె 1989లో ముంబై విశ్వవిద్యాలయంలోని సర్ జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి డిగ్రీ అందుకున్నారు. పునర్వినియోగం, సస్టునబుల్ పద్ధతుల్లో ఈమె అనేక నిర్మాణాలు చేపట్టారు. 2021లో చార్లెస్ జెంక్స్ అవార్డు, ఆర్కిటెక్చర్‌లో టెక్నాలజీ కోసం అగస్టే పెరెట్ అవార్డులు అందుకున్నారు. 

ఐశ్వర్య టిప్నిస్

2003లో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసిన ఐశ్వర్య, వారసత్వ నిర్మాణాల పరిరక్షణ చేస్తుంటారు. కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్‌గా చందర్‌నాగోర్ పట్టణంలో తాను చేపట్టిన పునరుద్ధరణ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. చందర్‌నాగోర్‌లో ఫ్రెంచ్ వారసత్వ నిర్మాణాల పరిరక్షణకు ఆమె చేసిన కృషికిగాను.. ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమెకు చెవాలియర్ డి ఎల్‌ఆర్డ్నేడెస్ ఆర్ట్స్ ఎట్‌డెస్ లెట్రెస్‌ను ప్రధానం చేసింది.