07-11-2025 08:28:21 AM
9 మంది అరెస్ట్, ఒకరు పరార్.
వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి సతీష్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సొంత ఇంటిలోనే చోరీ చేసేందుకు సుపారి గ్యాంగ్ తో చోరీకి యత్నించి పోలీసులకు చిక్కిన మైనమిది. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని దమ్మపేట సెంటర్లో గల అబ్దుల్ రసూల్ తల్లి ఫరా సుల్తాన తన గదిలోకి ఎవరిని రానీచ్చేది కాదు. దీంతో ఆ గదిలో విలువైన బంగారం, నగదు ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఓ పథకాన్ని రూపొందించారు. సొంత ఇంట్లో చోరీ చేసేందుకు సుల్తాన కోడలు ఇసరత్, మనుమడు అబ్దుల్ వాజిద్, కోడలు తండ్రి మహమ్మద్ ఉస్మాన్ లు పథకం ప్రకారం చోరీ చేసేందుకు ఓ సుపారి గ్యాంగ్ తో అంగీకారం కుదుర్చుకుంటారు.
వారు గురువారం తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్ ఫరా సుల్తానా ఇంట్లో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా రాత్రి గస్తి తిరుగుతున్న పోలీసులకు చిక్కారు. గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల మారుతి సుజుకి షోరూం దగ్గర జమ్ముల గార్డెన్ వద్ద 2 కార్లలో కొందరు అనుమానితులు ఉండగా ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు వారిని సోదా చేశారు. వారి వద్ద ఒక కత్తి ,రెండు ఇనుప రాడ్లు, నాలుగు మంకిక్యాప్స్ లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అబ్దుల్ రసూల్ తల్లి సుల్తానా ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చామని ఎవరైనా అడ్డం వస్తే హతమార్చడానికి కూడా పథకం రూపొందించామని అంగీకరించారు. మహమ్మద్ ఉస్మాన్ తో పాటు తనకు తెలిసిన బచ్చన్న గూడెం, హైదరాబాద్ కు చెందిన 8 మందిని మాట్లాడి చోరీకి పథకం వేశారు.
నిందితుల వివరాలు
జనగాం జిల్లాకు చెందిన బచ్చన్నపేట గ్రామ నివాసి మహమ్మద్ ఉస్మాన్, పాల్వంచ పట్టణం దమ్మపేట సెంటర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ వాజిద్, జనగాం జిల్లా కొడవటూరు గ్రామానికి చెందిన గంగారం కృష్ణ, సిద్దిపేట జిల్లా రామ్ సాగర్ గ్రామానికి చెందిన తాండూరు దాస్, హైదరాబాద్కు చెందిన దమ్మాయిగూడ ప్రాంత నివాసి ఇసుకంటి ఇమ్మానుయేల్, అదే ప్రాంతానికి చెందిన పొడిశెట్టి ప్రవీణ్, జనగాం జిల్లా కన్నబోయిన గ్రామానికి చెందిన ఎర్ర కనకరాజు, జనగాం జిల్లా కోడవటూరు గ్రామానికి చెందిన బండారపు నాగరాజు, నెక్కొండ కు చెందిన కత్తికొండ గణేష్ లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. అసలు సూత్రధారి మహమ్మద్ హిస్రత్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పాల్వంచ సీఐ, పట్టణ ఎస్ఐ సుమన్, రెండో ఎస్ఐ కళ్యాణి పాల్గొన్నారు.