11-05-2025 12:29:46 AM
సినీ చరిత్రలో మరపురాని పాత్రల్లో నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నిరుపా రాయ్. చాలామంది హీరోయిన్స్ తల్లి పాత్ర పోషించినప్పటికీ.. తల్లిలోని మాధుర్యాన్ని, భావోద్వేగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేది రాయ్.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది. బాలీవుడ్ ‘మా’గా పిలువబడే నిరుపా రాయ్.. తన ఐదు దశాబ్దల సినీ కెరీర్‌లో 190 చిత్రాల్లో నటించి.. ఉత్తమ నటిగా ఎన్నో పురస్కాలను కైవసం చేసుకున్నది. పౌరాణిక పాత్రల్లో దేవతగా నటించి.. ప్రేక్షకులపై చెదరని ముద్ర వేసింది.
‘దో బిఘా జమీన్’, ‘రామ్ అండ్ శ్యామ్’, ‘షహీద్’, ‘మునిమ్‌జీ’, ‘ఛాయా’, ‘షెహనాయ్’, ‘దీవార్’ వంటి చిత్రాల్లో తన ఉనికిని చాటుకున్నది. నిరుపా ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నది. వెండితెరపై ఆమె నటనకుగాను క్వీన్ ఆఫ్ మిజరీ, ట్రాజడీ క్వీన్‌గానూ ఆమెకు పేరొచ్చింది.
ఫ్యామిలీకి దూరంగా..
నిరుపా రాయ్ అసలు పేరు కోకిలా కిశోర్‌చంద్ర. కేవలం 15 ఏళ్ల వయసులో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సంవత్సరం కమల్ రాయ్‌ను వివాహం చేసుకున్నది. ఆ తర్వాత తన పేరును నిరుపా రాయ్‌గా మార్చుకున్నది. నిరుపా సినిమాల్లో నటించడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. దాంతో ఆమెతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నాడు. మళ్లీ ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు.
బాలీవుడ్ ‘మా’!
అప్పట్లో నిరుపా రాయ్‌ను దేవతగా భావించి.. ప్రేక్షకులు ఆమెను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి ఇంటికి వెళ్లేవారట. అంతగా ఆమె పౌరాణిక చిత్రాల్లో నటించి.. మెప్పించారు. అమితాబ్ బచ్చన్, శశి కపూర్, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి పెద్ద పెద్ద హీరోలకు తల్లిపాత్రలు పోషించింది. అలా బాలీవుడ్ సినిమాల్లో తల్లి పాత్రకు మారుపేరుగా నిలిచింది.
నిజజీవితంలో..
నిరుపా రాయ్ నిజ విషాధ భరితంగా ముగిసింది. 2001లో ఆమె కోడలు నిరు పా రాయ్, భర్త కమల్ రాయ్‌పై వరకట్న కోసం వేధించారని.. పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఆరోపణలు చిత్ర పరిశ్రమను కుదిపివేశాయి. నిరుపా రాయ్ అరెస్టు అయ్యే అవకాశాన్ని ఎదుర్కొంది. అయితే సమగ్ర దర్యాప్తు తర్వాత.. ఇరు వాదనలకు మద్దతు ఇచ్చే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది.
దేవతగా భావించి..
రాయ్ అమాయకమైన ముఖం, ఆమె మృదువైన స్వరం.. విశాలమైన, అస్పష్టమైన కళ్లు ఆమెను పౌరాణిక, ఇతిహాసాల్లో దేవత పాత్రలకు సరైన వ్యక్తిగా ఎంపిక చేశారు దర్శకులు. పౌరాణిక చిత్రాల్లో మీరాబాయి, సత్యవాన్ సావిత్రి, హర్ హర్ మహాదేవ్ వంటి పాత్రల్లో ప్రేక్షకులను కనువిందు చేసింది. దేవానంద్ నటించిన మునిమ్‌జీలో మొదటిసారి తల్లిపాత్ర పోషించింది.
ఆస్తి వివాదాల్లో..
నిజజీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. నిందలు ఆమెను మానసికంగా ఎంతో కుదిపేశాయి. కొన్ని సంతవ్సరాల తర్వాత.. ఆమె కుమారులు ఆస్తి వివాదంలో చిక్కుకున్నట్లు చూపించే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ ఆమె వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ వివాదాల మధ్యలో 2004లో గుండెపోటుతో 73 ఏళ్ల వయసులో మరణిచింది. ఆమె ఆస్తి కోసం జరిగిన వివాదం.. ఆమె మరణానికి కారణమైందని పుకార్లు వ్యాపించాయి.