శివుడికి తల్లైన బెజ్జమహాదేవి
నిజామాబాద్ జిల్లా బెజ్జోరలో గుడి
శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పం నిజామాబాద్ జిల్లా బెజ్జోర గ్రామంలోని బెజ్జందేవి గుడిలో ఉన్నది. వీరశైవ భక్తురాలైన అక్కమహాదేవి శిల్పం ప్రసిద్ధం. ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహం అంతటిదే. పాల్కురికి సోమన బసవపురాణంలో బెజ్జమహాదేవి కథ రాస్తూ.. ఆ బెజ్జమహాదేవి అందరికి అందరున్నారు కాని, శివునికి తల్లి ఉన్నట్టయితే తాపసిని కానిస్తుందా? జుట్టు జడలు కట్టనిస్తుం దా? తల్లుంటే విషం తాగనిస్తుందా? తోళ్ళు కట్టనిస్తుందా? పాముల ధరింపనిస్తుందా?
బూడిదపూసుకోనిస్తుందా? వల్లకాటిలో ఉండనిస్తుందా? తల్లి లేనందువల్లనే కదా శివునికిన్ని కష్టాలు నేనే శివునికి తల్లినవుతానని బెజ్జమహాదేవి లింగమూర్తిని కొడుకును జేసుకుని చంటిబిడ్డకు అభ్యంగనస్నానాలు చేయించినట్టు తాను స్నానమాడిస్తున్నదట. ఉగ్గు తినిపిస్తున్నదట. ముద్దాడుతున్నది. ఆమె చేస్తున్న బాల్యోపచారాలకు శివుడు మెచ్చి ఆమెవద్ద శిశువుగానే వుండిపో యాడట. బెజ్జ మహాదేవి శివుణ్ణి ‘నా కున్న, నా పట్టి, నా చిన్నవడుగ, నా కుర్ర’ అని గారాబాలు చేసింది. తన ఒడిలో పడుకోబెట్టుకుని తన్మయం చెందిందని వర్ణిస్తాడు.
బెజ్జోరలో బెజ్జమహాదేవి శిల్పం
శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పం నిజామాబాద్ జిల్లా బెజ్జోర గ్రామంలోని బెజ్జందేవి గుడిలో ఉన్నది. వీరశైవ భక్తురాలైన అక్కమహాదేవి శిల్పం ప్రసిద్ధం. ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహం అంతటిదే. ఈ శిల్పాన్ని మా కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ చూసి, ప్రతిమాలక్షణాలను గుర్తించడం కొరకు నాకు ఫోటోలు పంపాడు. ఇటువంటి శిల్పం ఇప్పటివరకు మరొకచోట ఉన్నట్టు జాడలేదు. అరుదైన చారిత్రక విగ్రహం. వీరశైవానికి గుడికట్టినచోటు బెజ్జోర. బెజ్జోర గ్రామానికి ఆ పేరు రావడానికి, గుడిని బెజ్జందేవి గుడి అనడానికి గుడిలో నెలకొన్న బెజ్జమహాదేవి శిల్పమే మూలకం. బెజ్జందేవి గుడిలో ప్రధాన దేవత చాముండి కాకతీయానంతరశైలి శిల్పం.
ఆ దేవతకు రెండువైపుల కనిపిస్తున్న రెండు చాముండి శిల్పాలు రాష్ట్రకూటశైలికి చెందినవి. రెండు లింగాలు చాళుక్య వర్తులాకారపు పానవట్టాలతో ఉన్నాయి. రాష్ట్రకూట, చాళుక్యశైలులలో రెండు గణపతిశిల్పాలు, వర్తులాకారపు పానవట్టాలలో రెండు లింగాలు, పానవట్టం లెని ఒక లింగం, దాని వెనక లగుడధారి శైవగురువున్నాడు. ఇంకొక శైవగురువు బెజ్జందేవి శిల్పం సమీపంగా వున్నాడు. గుడికి అనుబంధంగా మెట్లబావి వున్నది. రాష్ట్రకూటుల కాలపు నంది, ఒక నాగశిల వున్నాయి. ఉత్తరాభిముఖుడైన భక్త, శిఖాంజనేయుడున్నాడు. ఒక వీరగల్లు కూడా వుంది. శాసనస్తంభం ఆ ప్రాంగణంలో అగుపించింది.
క్షేత్రసందర్శన, ఫొటోగ్రఫీ: కంకణాల రాజేశ్వర్
శ్రీరామోజు హరగోపాల్,కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం 99494 98698






