3 May, 2026 | 1:36 AM

అడవి గూడెంలో గ్రంథాలయం

03-05-2026 12:17 AM

మురిసిపోతున్న గిరిజన యువత

బీర్కూర్ వార్ వెంకటేష్ (విజయక్రాంతి, ఆదిలాబాద్): అడవుల్లో ఉంటూ, అటవీ ప్రాంతంలో లభించే వివిధ ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్న అడవి బిడ్డల జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అటవీ గ్రామాల్లో పలు గ్రం థాలయాలను ఏర్పాటు చేశారు.

అటవీ ప్రాంతాల్లో యువత చదువుపై ఆసక్తి చూపేలా గ్రంథాలయాలను నెలకొల్పుతూ వారిలో అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. గ్రంథాలయాలు అందుబాటులో లేక  మారుమూల గిరిజన గూడాల్లోని నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులను గుర్తించిన పోలీసు శాఖ వారి కోసం గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తూ వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ గ్రంథాలయా న్ని తాజా మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాంతి భద్రతల పరిరక్షణనే  ప్రధాన విధి అయినప్పటికీ పోలీ సు శాఖ సామాజిక బాధ్యతగా పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గూడల్లోని యువతే లక్ష్యంగా అనేక సంస్కరణలను కూడా చేపడుతోంది. ఇందులో భాగంగానే ఆదిలాబా ద్ గ్రామీణ మండలంలోని మారుమూల గిరిజన గూడమైన చించుఘాట్‌లో పోలీసు శాఖ అక్కడి నిరుద్యోగ యువతీ యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది.

ఇటీవల తాజా మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. చించుఘాట్ గ్రామంలో డిగ్రీ, ఆపై చదువులు చదివిన యువత వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. దానికోసం జిల్లా కేంద్రంతో పాటు ఇతర నగరాలకు వెళ్లవలసి వచ్చేది. చిం చుఘాట్‌లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఈ గ్రామ యువతకే కాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లోని నిరుద్యోగ యువతకు కూడా పోటి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మంచి అవకాశం లభించింది.

ఈ గ్రంథాలయంలో కానిస్టేబుల్, జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు జనరల్ స్టడీస్, భారత దేశ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోని యువత ఈ లైబ్రరీకి వచ్చి తాము రాస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను తీసుకొని చదివి అక్కడే పెట్టి వెళుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు శాఖ ఇప్పటికే తిర్యాణి, రెబ్బెన ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. పాత పోలీసు స్టేషన్ భవనాలను గ్రంథాలయాలుగా తీర్చిదిద్ది నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన తొలి గ్రంథాలయం ఈ చించుఘాట్‌దే కావడం విశేషం.

యువతలో సంతోషం..

గ్రామంలోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడి యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభ్యర్థులు శ్రీజ, కుమ్ర సాయి కిరణ్ తెలిపారు. గతంలో చదువుకోవడానికి డబ్బులు ఖర్చు చేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఈ గ్రంథాలయ ఏర్పాటుతో ఆ సమస్య తీరిందని, ఇక్కడ అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నా యి.. వాటి కోసం తాము మరెక్కడికి వెళ్ళాల్సిన పనిలేదని పేర్కొంటున్నారు.

పోలీసు శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని మారుమూల గ్రామమైన తమ గూడెంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంపట్ల గ్రామస్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయ ఏర్పాటుతో తమ గ్రామ యువతకు దూర భా రం, వ్యయప్రయాసలు తప్పాయని రాయి సెంటర్ సార్ మేడి ఆత్రం పరశురాం, గ్రామ పటేల్ కుమ్ర రాజు తెలిపారు.