calender_icon.png 15 November, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"ఇసుక కొనేటట్టు లేదు".. "ఇల్లు కట్టేటట్టు లేదు"

15-11-2025 11:09:45 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి "ఇసుకే బంగారమాయెనే"...

అధికారులు అనుమతులు ఇయ్యరాయే...

ట్రాక్టరరోలు ఇసుకపోయరాయే...

వలిగొండ,(విజయక్రాంతి): అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా మూసి పరివాహక ప్రాంతమైన వలిగొండ మండలంలో(Valigonda Mandal) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక లేక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు "ఇసుక కొనేటట్టు లేదు"."ఇల్లు కట్టేటట్టు లేదు". "ఇసుకే బంగారమాయెనే".. అని నిట్టూర్చుతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక కోసం ఇందిర ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ఇసుక అనుమతులు అధికారులు ఇవ్వడం లేదని లబ్ధిదారులు తెలియజేస్తున్నారు.

దీంతో ఇసుక  రవాణాదారులు మూసీ నుండి ఎలాగోలా ఇసుక సేకరించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అమ్ముతున్నారు. అయితే ఈ క్రమంలో ఇసుక రవాణా దారులు వే బిల్లు చెల్లించడం, రవాణా పట్టాదారుల భూములు నుంచే పోవడంతో వారికి డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుండడంతో చేసేది లేక తమ గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఇసుక అధిక రేటు పెట్టి కొనలేమని ఆవేదన చెందుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కోసం అనుమతులు ఇచ్చి, రవాణా కోసం బాటలు ఉన్న భూమి పట్టాదారులతో అధికారులు మాట్లాడితే తమకు ఇసుక ప్రస్తుతం ఉన్న రేటులో సగానికి లభ్యమవుతుందని అధికారులు చొరవ తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న పేదలకు సహకరించాలని కోరుతున్నారు.