15-11-2025 10:25:02 AM
పోలీసులకు చాలెంజ్..
ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్..
6 నెలలుగా రవి కోసం పోలీసుల గాలింపు..
హైదరాబాద్: పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని(iBomma Owner Ravi Arrested) అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నాడు. వెబ్‌సైట్ లో తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ అప్ లోడ్ చేస్తున్నాడు. తెలుగు ఫిలిం యాంటీ పైరసీ టీమ్ గతంలో ఐ బొమ్మపై ఫిర్యాదు చేసింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఐ బొమ్మ నిర్వహకులు పోలీసులకు సవాల్ చేసిన విషయం తెలిసిందే.
సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ రవి బ్లాక్‌మెయిల్ చేశాడు. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రవి కోసం పోలీసులు గత 6 నెలలుగా గాలిస్తున్నారు. చిత్రపరిశ్రమకు రవి వల్ల దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన సినిమాను గంటల్లోనే హెచ్ డీ ప్రింట్ తో ఐబొమ్మ, బప్పం టీవీల్లో విడుదల చేస్తున్నాడు. ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. రవి బ్యాంకు ఖాతాలోని రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ ను పోలీసులు తనిఖీ చేశారు.