calender_icon.png 5 August, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు

03-08-2025 12:28:57 AM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజల కోసం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి, సేవలు అందించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి, వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలంలో అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు.

వార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధులలో సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం మండల తహశీల్దార్ సతీష్ కుమార్ తో కలిసి మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శ పాఠశాలలను సందర్శించి, వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులు, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ, అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన భూ సమస్యల సంబంధిత దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ రకాల ధృవపత్రాల మంజూరు కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి, నిర్ణీత గడువులోగా జారీ చేయాలన్నారు. అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.