21-12-2025 12:00:00 AM
భయం, అత్యాశే
నేరగాళ్ల పెట్టుబడి
పండుగ వేళ ఫేక్ ఆఫర్లతో మోసపోవద్దు
పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల మాయాజాలాన్ని ఛేదించాలంటే కేవలం పోలీసుల నిఘా మాత్రమే సరిపోదు. ప్రతి ఇల్లూ ఒక రక్షణ కోటగా మారాలి. ఇందుకోసం ప్రతి కుటుంబంలో ఒకరు సైబర్ సింబాగా మారి బాధ్యత తీసుకోవాలి’ అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యం లో శనివారం మధురానగర్‌లో నిర్వహించిన జాగృత్ హైదరాబాద్ -సురక్షిత్ హైద రాబాద్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు.
ప్రజ ల్లో ఉండే భయం, అత్యాశలను సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నార న్నారు. లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో ఆశ చూపి బుట్టలో వేసుకోవడం ఒక ఎత్తు. ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయంటూ, మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేయడం మరో ఎత్తు అని వివరించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్నారని, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గోల్డెన్ అవర్ ముఖ్యం..
సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందించడాన్ని గోల్డెన్ అవర్’ అంటారని సీపీ తెలిపారు. బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా పోర్టల్లో ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసి, తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే క్రిస్మస్, న్యూ ఈయర్, సంక్రాంతి పండుగల సీజన్ కావడంతో ఆఫర్లు, గిఫ్ట్ కూపన్ల పేరుతో వచ్చే మెసేజ్లు, వాట్సాప్ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఐబొమ్మ రవి విచారణలో కీలక సమాచారం రాబడుతున్నామని అదనపు సీపీ క్రైమ్‌ఎం. శ్రీనివా సులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ ఎ. అరవింద్ బాబు, వెస్ట్ జోన్ డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు మనోహర్ రావు, అఖిలేష్‌లు పాల్గొన్నారు.