05-08-2025 12:24:31 AM
ఖైరతాబాద్, ఆగస్టు 4: బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. జిల్లాల్లో ఆధ్యక్ష పదవి ఇవ్వని బీఆర్‌ఎస్, బీసీ బిడ్డను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ, దొంగ సర్వేతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ బీసీల నయవంచనకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు.
సోమవారం సోమాజిగూడ ప్రెసెక్లబ్‌లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు బిసిలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు తెస్తే పులదండలు వేస్తామని అన్నారు.
లేనిపక్షంలో నల్లజెండాలు ఎగురవేస్తామని తెలిపారు. మొ న్న కులగణనలో 15శాతం ఒసిలు ఉన్నట్లు లెక్కలు తేల్చారని, దాని ప్రకారమేస్థానిక సంస్థల ఎన్నికల్లో 15 శాతం వాటా తీసుకోవాలన్నారు. తమ డేటాప్రకారం జడ్పిటిసి, ఎంపి టిసి ఎన్నికల్లో బిసిలు 50శాతం వాటాకు చేరుకొన్నారని, ఇక మీరిచ్చే 42శాతం ఎందుకని ప్రశ్నించారు. ఐతే 42 రిజర్వేషన్ల ను 9 వ షెడ్యూల్లో పెడితే మంచిదన్నారు.
ఎన్నికల్లో కాదు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తు తం పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర జరుగుతుందని, బిజేపీ, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మూడు పార్టీల రాష్ర్ట అధ్యక్షులు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే నిరాహారదీక్ష చేయాలని అన్నారు.
మల్లన్నను అడ్డుకున్న నిరుద్యోగులు
నిరుద్యోగ యువతలో పేరుకుపోతున్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నిరుద్యోగుల నుంచి ఊహించని నిరసన సెగ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌ను డీఎస్సీ అభ్యర్థులు అడ్డుకుని, ఆయనను చుట్టుముట్టారు. తమ సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ అంశాలపై మాట్లాడటమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మా ఓట్లతో నువ్వు గెలిచావు. ఇప్పుడు మా సమస్యల గురించి ఒక్క మాటైనా మాట్లాడవా?” అంటూ మల్లన్నను సూటిగా ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, న్యాయం కోసం పోరాడాల్సిన నేతలు ఇలా మౌనంగా ఉండటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల నుంచి ఊహించని ప్రశ్నలు, నిరసన ఎదురవడంతో తీన్మార్ మల్లన్న తీవ్ర ఇరకాటంలో పడ్డారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో, తీవ్ర అసౌకర్యానికి గురై, ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో విలేకరుల సమావేశం రసాభాసగా మారింది.