11-07-2025 12:00:00 AM
మంత్రి కొండా సురేఖ
వరంగల్ (మహబూ బాబాద్) జూలై 10 ( విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం దేవాలయ భూముల స్వాధీనం అంశం సున్నితమైనదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భద్రాచలం దేవాలయ భూముల స్వాధీనం కోసం చర్చలు నిర్వహించి, భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
గురువారం వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో నిర్వహించిన శాఖంబరి వేడుకలను మంత్రి సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారికంగా దేవాదాయ శాఖ మంత్రి హోదాలో అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అనంతరం శాకంబరి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన తరువాత విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం భూముల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. భూముల స్వాధీనానికి వెళ్లిన ఘటనలో గాయపడ్డ ఈవో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
భద్రాచలం ఆలయ భూములను తిరిగి స్వాధీనం తీసుకొని ఆ భూముల్లో సుబాబుల్, జామాయిల్ మొక్కలు నాటి తిరిగి అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, సానుకూల ధోరణి తో భూముల స్వాధీనానికి కృషి చేస్తామన్నారు. భద్రాచలం తో పాటు దేవాలయాలకు సంబంధించిన పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.