11-07-2025 12:00:00 AM
నల్లగొండ, జూలై 10 (విజయక్రాంతి): ఆయనో విద్యుత్ శాఖ ఉద్యోగి. పైగా యూనియన్ లీడర్.. ఇంకేముంది.. 15 ఏండ్లుగా జిల్లా కేంద్రంలోనే తిష్ట వేశాడు. ఇన్నేండ్ల సర్వీసులో పక్క పక్క ఛాంబర్లు మారడం మినహా పక్క ప్రాంతానికి బదిలీ అయిన దాఖలాల్లేవు. సదరు ఉద్యోగి వ్యవహారం చూస్తుంటే.. రిటైర్మెంట్ అయ్యేంతవరకు ఆ కార్యాలయాన్ని వదిలివెళ్లేలా కన్పించడం లేదు.
ఇదంతా ఒక ఎత్తయితే.. సదరు ఉద్యోగి ఓవైపు విద్యుత్ శాఖ ఉద్యోగిగా కొనసాగుతూనే.. మరోవైపు బినామీల ద్వారా ఫర్మ్ సృష్టించి విద్యుత్ వరక్స్ చేస్తుండడం కొసమెరుపు. పైగా తనకు అనుకూలంగా ఏ అధికారి పని చేయకపోయినా టార్గెట్ చేసి బెదిరింపులకు దిగడం ఆ ఉద్యోగి నైజం. ఇంత జరుగుతున్నా.. ఉన్నతాధికారులెవ్వరూ సదరు ఉద్యోగి నిర్వాకాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ ఉద్యోగి అరాచకానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.
బినామీ ఫర్మ్ పేరుతో కాంట్రాక్టు వర్క్స్
విద్యుత్ శాఖలో 15 ఏండ్లుగా ఒకే కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండడం.. పైగా యూనియన్ పేరుతో జిల్లా స్థాయి అధికారులకు నిత్యం టచ్లో ఉండడం వల్ల విద్యుత్ శాఖపై మంచి పట్టు దొరికింది. దీంతో ఆ పట్టును క్యాష్ చేసుకుని ఓ వ్యక్తి పేరు మీద బినామీ ఫర్మ్ సృష్టించాడు. సదరు ఫర్మ్‌ను అడ్డం పెట్టుకుని ఆ వ్యక్తి పేరు మీద విద్యుత్ కాంట్రాక్టు పనులన్నీ చక్కబెట్టేస్తున్నాడు. ఓవైపు నెలనెలా జీతం..
మరోవైపు విద్యుత్ వరక్స్ బిల్లులతో రెండు చేతుల నిండా సంపాదిస్తూ రూ.కోట్లు కూడ బెట్టేస్తున్నాడు. న్యాయంగా ఫర్మ్ తీసుకుని విద్యుత్ కాంట్రాక్టు పనుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత, చిన్న కాంట్రాక్టర్లను పక్కకు నెట్టి అన్నీ పనులను సదరు ఫర్మ్ చేస్తుండడం విద్యుత్ శాఖలో వివాదస్పదంగా మారింది. ప్రధానంగా తిప్పర్తి, కనగల్ సెక్షన్లలోని పనులను దాదాపు ఆ ఉద్యోగికి చెందిన ఫర్మ్ చేస్తుండడంపై సొంత శాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాట వినకపోతే అధికారులకు బెదిరింపులు
విద్యుత్ శాఖలో ఉద్యోగితో పాటు యూనియన్లోనూ కీలక లీడర్ కావడం వల్ల సదరు ఉద్యోగి చేసే అరాచకాలపై ఎవ్వరూ నోరు మెదపడం లేదు. జిల్లా స్థాయి అధికారులకు అంతా తెలిసినప్పటికీ సదరు ఉద్యోగిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ఫర్లు,
ప్రమోషన్ల విషయంలోనూ జోక్యం చేసుకుని అధికారులు తనకు అనుకూలంగా పని చేయకపోతే టార్గెట్ చేసి లేనిపోని ఇబ్బందులు సృష్టించడం పరిపాటిగా మారింది. ఇటీవల ఓ ప్రమోషన్ విషయంలో జోక్యం చేసుకుని నకిరేకల్ సెక్షన్లో తన వ్యక్తికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటూ ఓ ఇద్దరు అధికారులను తీవ్రంగా ఇబ్బందిపెట్టినట్టు సమాచారం. ఇలాంటి ఆరోపణలు దాదాపు ప్రతి సెక్షన్లోనూ సదరు ఉద్యోగిపై ఉన్నాయంటే పరిస్థితి ఏలా ఉందో అర్థమవుతోంది.
అండదండలతో మరో ఉద్యోగి సైతం..
యూనియన్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహారించే సదరు ఉద్యోగి అండదండలతో మరో ఉద్యోగి సైతం అదే అవతారం ఎత్తాడు. నార్కట్పల్లిలో పనిచేసే మరో ఉద్యోగి సైతం విద్యుత్ శాఖలో పనిచేస్తూనే కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. సదరు ఉద్యోగి సైతం ఒకేచోట 15 ఏండ్లుగా కొనసాగుతుండడం గమనార్హం. వారసత్వ రాజకీయాల తరహాలో తన కుటుంబ సభ్యుల పేరు మీద కాంట్రాక్టు వరక్స్ చేయడం కొసమెరుపు.
సదరు ఉద్యోగి ఒకేచోట 15 ఏండ్లుగా పనిచేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో గతంలో అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. అయినా నేటికీ సదరు ఉద్యోగి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడంటే పరిస్థితి అర్ధం చేసుకొవచ్చు.
ఈ ఉద్యోగికి యూనియన్లో కీలకంగా వ్యవహరించే సదరు ఉద్యోగి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే అధికారులు సైతం మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మరీ ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్ శాఖలో బినామీ కాంట్రాక్టర్ల వ్యవహారంతో పాటు ఉద్యోగుల ఆగడాలపై చర్యలు తీసుకుంటారా..? లేక షరా మాములుగానే వ్యవహరిస్తారా..? అన్నది వేచిచూడాల్సిందే.