calender_icon.png 5 August, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ సిబ్బందిపై మహాలక్ష్మి ఎఫెక్ట్

12-08-2024 12:35:31 AM

  1. సంస్థ కార్మికులపై పెరుగుతున్న దాడులు 
  2. పథకం ప్రభావంతో 3 రెట్లు పెరిగిన ప్రయాణికులు 
  3. 2012 నుంచి జరగని నియామకాలు 
  4. బస్సులు, సిబ్బంది పెంపు కోసం కార్మికుల వినతి

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ విద్యానగర్‌లో గురువారం చేయి ఎత్తితే ఆపలేదన్న కోపంతో ఓ వృద్ధురాలు బస్సు అద్దాలను బీర్ బాటిల్‌తో పగులగొట్టడమే కాకుండా ఆమెను పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా మహిళా కండక్టర్‌పై తన వద్ద ఉన్న పామును విసిరి తప్పించుకునేందుకు యత్నించింది. చివరికి స్థానికులు ఆ వృద్ధురాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ఈ ఏడాదిలో పెద్దఎత్తున చోటుచే సుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.

దీంతో ఊహించని విధంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయిం ది. ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెరిగింది. కొత్త బస్సులు లేకపోవడంతో పాటు 2012 నుంచి సిబ్బంది నియామకం జరుగలేదు. కానీ ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై గొడవలకు దిగుతున్న సంఘటనలు భారీగా పెరిగాయి. ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌తో ఎప్పుడు ఏం గొడవ జరుగుతుందో అర్థం కాని విధంగా పరిస్థితి మారి పోయింది. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సేవలందిస్తున్న సిబ్బందికే భద్రత లేకుండాపోయింది. విధులు నిర్వర్తించేందుకు కార్మికు లు భయపడే విధంగా పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు.

భారీగా పెరిగిన రద్దీ 

మహాలక్ష్మి పథకానికి ముందు ఉన్న ఆక్యుపెన్సీ రేషియా ఇప్పుడు రెట్టింపైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మం ది ప్రయాణించారు. వీరిలో మహిళలే 36 లక్షల మంది. అర్టీసీలో ఏటా పదవీ విరమ ణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరుగుతున్నా నియామకాలు మాత్రం లేవు. బస్సుల సంఖ్య కూడా పెద్దగా పెరగడంలేదు. గతేడా ది నవంబర్‌లో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షలు ఉండగా మహాలక్ష్మి పథ కం తర్వాత 3 రెట్లు పెరిగి 52 లక్షలకు చేరింది.

ప్రస్తుతం ఆర్టీసీలో 41,958 మంది సిబ్బంది, 9,094 బస్సులున్నాయి. ఇవి ఈ స్థాయిలో ప్రయాణికులకు సేవలందించేందుకు ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో కార్మికులకు అదనపు డ్యూటీలు వేస్తున్నారు. ఎంత సంయమనంతో పనిచేసినా ప్రయాణికులతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు నేరుగా దాడులకే దిగుతున్నారు. ఫిర్యాదులు వస్తే కార్మికులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం లో ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్తగా బస్సులు ఇవ్వడంతో పాటు సిబ్బందిని నియమించి తమ కష్టాలు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. 

ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులు మచ్చుకు కొన్ని...

  1. జనవరి 31న హయత్‌నగర్ నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్లే బస్సులో రూ.500 ఇచ్చి టికెట్ కావాలని అడిగిన ఓ మహిళను మొదటి ట్రిప్ అని చిల్లర ఇవ్వాలని కండక్టర్ కోరింది. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. 
  2. ఫిబ్రవరి 10న తాను దిగేందుకు అడిగిన చోట బస్సు ఆపలేదని ఆరోపిస్తూ శివరాంపల్లికి చెందిన ఓ మహిళ బూతులు తిడుతూ కండక్టర్‌పై చెప్పుతో దాడి చేసింది. మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
  3. జూన్ 14న వరంగల్ నుంచి నెక్కొండ వెళ్లే బస్సులో ఇద్దరు కూతుళ్లు, సామగ్రిని ఎక్కించిన తర్వాత బస్సులో స్థలం లేదని ఇంకో బస్సులో రావాలని కండక్టర్ చెప్పడంతో ఓ మహిళ ఆటోలో బస్సును వెంబ డించింది. కొంత దూరంలో బస్సును ఆపి ముందు కూర్చుని అరగంటకు పైగా బస్సు ముందుకు వెళ్లకుండా ఆందోళన చేసింది. 

బస్సులు, సిబ్బంది కావాలి

ఆర్టీసీలో కొత్త బస్సుల మాటే లేకుండా పోయిం ది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మిపథకం కార్మికులపై పనిభా రాన్ని విపరీతంగా పెంచింది. రోజుకు 20 లక్షలలోపు ఉండే ప్రయాణికులు 3 రెట్లు పెరిగారు. పదవీ విరమణతో సిబ్బంది తగ్గిపోతున్నారు. కాలం చెల్లిన బస్సులతోనే విధులు నిర్వర్తిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాపై ప్రయాణికులు దాడు లు చేయడం సరికాదు. పని గంటలు మించి విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ కార్మికుల కష్టాలను ప్రయాణికులు సైతం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. కొత్త బస్సులతో పాటు సిబ్బంది నియామకా లు చేపట్టి కార్మికుల కష్టాలను ప్రభుత్వం తీర్చాలి. 

 థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి దాడులు పెరుగుతున్నాయి

మహాలక్ష్మి పథకం తర్వాత సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రైవర్, కండక్టర్లపై దాడులు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రయాణికులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్న ఎండీ.. కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మాపై దాడులకు కారణమవుతున్న అంశాలను సహేతుకంగా ఆలోచించాలి. కొత్త నియా మకాలు చేపడతామని గత నెల 2న ఎండీ ప్రకటించారు. 3,035 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. 3వేల కొత్త బస్సులు తెస్తామన్నారు. అదీ జరగలేదు. రోజు కు కార్మికులపై 3 నుంచి 8 గంటల వరకు అదనపు భారం మోపుతున్నారు. చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్