08-07-2025 02:28:10 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు, పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అప్పులపై లెక్కలతో సహా అసెంబ్లీలో చర్చిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ విసిరితే, ఆ సవాల్ కు సమాధానం ఇవ్వకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీకి రాకుండా అడ్డుపడుతూ, ఎవరు పడితే వారే బహిరంగ చర్చ పేరుతో పిలిస్తే ఎలా వెళతామని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ప్రెస్ క్లబ్ వద్ద చర్చ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి బట్టి ప్రసంగించారు.
రైతాంగానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని గొంతు చించుకొని అరుస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎక్కడ అన్యాయం జరిగిందో అసెంబ్లీకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయకుండా 25 వేల చొప్పున నాలుగు సార్లు వేసి వడ్డీకే సరిపోయిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయడం అన్యాయమా అంటూ ప్రశ్నించారు. అలాగే రైతులకు భీమా సౌకర్యం, సన్నధాన్యానికి బోనస్ 500 చొప్పున చెల్లించడం, గతంతో పోలిస్తే విద్యుత్తు డిమాండ్ పెరిగినప్పటికీ ఎక్కడ కూడా కోతలు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం, అలాగే పేదల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం అన్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయమా అంటూ ప్రశ్నించారు. 18 నెలల కాలంలో వ్యవసాయ రంగానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అన్యాయమా అంటూ ప్రశ్నించారు. లక్షన్నర కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో వల్ల పట్టుమని పది ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని మీరు రైతాంగం, పేదల గురించి మాట్లాడడం చూస్తే నవ్వొస్తుందన్నారు.
నీళ్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం పైనే ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్ర కు వెళ్లి ఇష్టం వచ్చినట్లు హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం కృష్ణ, గోదావరి బేసిన్ లలో తెలంగాణకు రావలసిన నీళ్ల వాటా కోసం నిక్కచ్చిగా పోరాడుతుందని, ఈ విషయంపై కూడా అసెంబ్లీలో చర్చిద్దామని రమ్మంటే, అసలు నిజాలు బయటికి వస్తాయని, అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తూ, బహిరంగ చర్చ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయదలుచుకుంటే అసెంబ్లీకి రండి, 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనండి, సంక్షేమ, అభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాల అంశాలను చర్చిద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేటీఆర్ కు సవాల్ విసిరారు. మీరు చేసిన పాలన నచ్చక, ప్రజలు మాకు అధికారం ఇచ్చారని, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా ఇంకా మీ తీరు మారలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు.