08-07-2025 06:41:19 PM
వందల ఏళ్లుగా సాధించకున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్..
ఇల్లెందు (విజయక్రాంతి): కార్మిక హక్కులను కాపాడే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు తెచ్చిందని వాటిని వెంటనే రద్దుచేయాలని జాక్ నేతలు దేవరకొండ శంకర్, జే వెంకటేశ్వర్లు, నజీర్ అహ్మద్, అబ్దుల్ నబి, యాకుబ్ షావలి, సారంగపాణిలు డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి సివిక్, జీసీసీ హమాలీ, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, జీపీ, ఐకేపి అడ్డా మీటింగులు, ప్రదర్శనలు, నిర్వహించిన అనంతరం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎండిఓకు సమ్మె నోటీసు ఇచ్చారు. విస్తృత సమావేశాలలో వారు పాల్గొని మాట్లాడుతూ... నాలుగు లేబరుకోడ్లు కార్మికులకు వురితాళ్ళని ఒకవైపు ప్రబుత్వరంగాన్ని ప్రయివేట్ వాళ్లకు దారదత్తం చేస్తూ మరోవైపు కార్మిక హక్కులను కాలరాస్తు ప్రభుత్వ రంగాన్ని, బొగ్గు బ్లాకులు మొత్తాన్ని ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారంటూ వారు విమర్శించారు.
దానీ అమలు ఆంధ్రాలో మొదలయిందని తెలంగాణాలో సన్నాహాలు మొదలు పెట్టారని దానికి అనుగుణంగానే ప్రభుత్వ కదలకలు ఉన్నాయని వారు అన్నారు. ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతికార్మికుడిపై, ప్రజలపై బాధ్యత ఉన్నదని దానికోసం జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని ప్రభుత్వాలకు కార్మిక శక్తిని చూపించాలని వారు పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెట్టే రైతులు, కార్మికుల పొట్టగొడుతూ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు చేస్తూ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారని రైతాంగం వీరోచితంగా 400 రోజులు పైబడి ఢిల్లీని దిగ్బందించి పోరాడి వాటిని రద్దు చేసుకున్నారని అదే స్ఫూర్తితో కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, సీపీఐ పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్, ఎస్ కే ఎం జిల్లా నేత, తుపాకుల నాగేశ్వరరావు, రాంసింగ్, రాసుద్దీన్, తాళ్లూరి కృష్ణ, మోజెస్, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, రావూరి ఉపేందర్ రావు, కార్మికులు పాల్గొన్నారు.