calender_icon.png 9 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

08-07-2025 06:43:53 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. వర్షాకాలం పంటలు సాగు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జె.పి.న‌డ్డాను ఢిల్లీలోని ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం క‌లిశారు. రాష్ట్రానికి సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని సీఎం వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను అందజేయాలని జేపీ న‌డ్డాకు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. 

వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు  మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం, సాగు ప‌నులు జోరుగా సాగుతున్నందున‌ యూరియా స‌ర‌ఫ‌రాలో ఆటంకాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని కోరారు. జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్ప‌త్తి అయిన 63 వేల మెట్రిక్ ట‌న్నులు యూరియా, విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న 97 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా మాత్ర‌మే చేశార‌ని కేంద్ర మంత్రికి ఆయన తెలిపారు. 

దేశీయంగా ఉత్ప‌త్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణ‌కు పెంచాల‌ని సీఎం కోరారు. యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన ర్యాక్‌లు కేటాయించ‌డం లేద‌ని, వాటి సంఖ్య పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేంద‌ర్ రెడ్డి, ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య కార్య‌ద‌ర్శి డా. గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.