calender_icon.png 8 July, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు కోరుకున్నట్లే సంక్షేమ పథకాలు

08-07-2025 02:24:18 PM

హైదరాబాద్: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) మంత్రులు పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, రూ. 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజాసంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే.. సంక్షేమ పథకాలు వస్తాయని ప్రజలు భావించి దీవించారని చెప్పారు. ప్రజలు కోరుకున్నట్లే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశామన్నారు.

9 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాల్లో రైతుభరోసా(Rythu Bharosa) కింద రూ. 9 వేల కోట్లు వేశామని చెప్పారు. రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను ఇస్తున్నామన్నారు. రైతుల మోటార్లు బిల్లుల కింద రూ. 12500 కోట్లను విద్యుత్ శాఖకు చెల్లించామని తెలిపారు. రూ. 12,500 కోట్లతో ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ప్రారంభించామని పేర్కొన్నారు. సోలార్ పంపుసెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ అందజేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని నిలిపివేసిందని చెప్పిన డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వడ్డీలేని రుణాల పథకాన్ని మళ్లీ ప్రారంభించిందని సూచించారు. ఈ నెల 15-20 తేదీల మధ్య డ్వాక్రా సంఘాలకు అధిక మొత్తంలో వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నామని ప్రకటించారు. డ్వాక్రా సంఘాలకు ఏటా రూ. 50 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ రైతుల కోసం రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని సీఎం చెప్పారని తెలిపారు.

రూ. లక్ష కోట్ల పంపిణీపై చర్చకు రావాలని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.. కేసీఆర్ కు సవాల్ విసిరితే కేటీఆర్ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి చురకలంటించారు. రూ. లక్ష రుణమాఫీ విషయంలో కేసీఆర్ రెండు సార్లు మోసం చేశారు.. తొలిసారి రుణమాఫీ పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారు.. విడతల వారీగా ఐదేళ్లలో చేయడంతో వాళ్లు ఇచ్చింది వడ్డీలకే సరిపోదని ఆరోపించారు. రెండోసారి రుణమాఫీని ఐదేళ్లో కూడా పూర్తి చేయక పెండింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం పేదలకు అదనంగా 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. రేషన్ కార్డు(Ration cards) దారులకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు.  గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను కూడా పట్టించుకోలేదని విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పేదలకు రూ. 5 లక్షలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.