13 July, 2026 | 3:32 AM

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభంలో భారీ క్షీణత

03-05-2024 12:16 AM

36 శాతం తగ్గుదల

ఆదాయం రూ.29,180 కోట్లు

న్యూఢిల్లీ, మే 2: గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో భారీగా తగ్గింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే కంపెనీ నికరలాభం 38 శాతం క్షీణించి రూ.722 కోట్ల నుంచి రూ.451 కోట్లకు పడిపోయింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.28,944 కోట్ల నుంచి రూ.29,180 కోట్ల కు  చేరింది. 2023 డిసెంబర్ క్వార్టర్ నుంచి స్వీక్వెన్షియల్‌గా కన్సాలిడేటెడ్  నికరలాభం రూ.1,885 కోట్ల నుంచి ఏకంగా 76 శాతం క్షీణించింది. ఆదాయం మాత్రం రూ. 25,050 కోట నుంచి 16.5 శాతం పెరిగింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.1.30 చొప్పున డివిడెండు ను సిఫార్సుచేసింది. డివిడెండు చెల్లింపునకు జూన్ 14 రికార్డుతేదీగా నిర్ణయించింది. 

ఎయిర్ పోర్టుల ఇబిటా 130% వృద్ధి

ముగిసిన క్యూ4లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇబిటా రూ.3,974 కోట్ల నుంచి రూ. 3,646 కోట్లకు తగ్గినప్పటికీ, కంపెనీ నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు మంచి ప్రదర్శన కనపర్చాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఇబిటా 130 శాతం వృద్ధితో రూ. 662 కోట్లకు చేరింది. రహదారుల వ్యాపారంలో హామ్ ప్రాజెక్టుల ఇబిటా రూ.1,038 కోట్లుగా నమోదయ్యింది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారం ఇబిటా 6 రెట్లు పెరిగి రూ.641 కోట్లకు చేరింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఇబిటా 32 శాతం వృద్ధితో రూ.13,237 కోట్లకు పెరిగింది.