కోటక్ బ్యాంక్‌కు మరో దెబ్బ
వైదొలిగిన జాయింట్ ఎండీ
ఏడాది కనిష్ఠానికి షేరు పతనం
న్యూఢిల్లీ, మే 2: ఇటీవలే రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణలకు గురైన కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై మరో దెబ్బ పడింది. బ్యాంక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ మణియన్ రాజీనామా చేశారన్న వార్తతో గురు వారం కోటక్ బ్యాంక్ షేరు 4 శాతంపైగా క్షీణించి 52 వారాల కనిష్ఠస్థాయి రూ.1,550 వద్దకు పతనమయ్యింది. కొన్ని పాలనా లోపాల్ని గుర్తించిన ఆర్బీఐ గతవారమే కోటక్ మహాంద్రా బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డు లు జారీచేయకుండా, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భగా 10 శాతంపైగా పడిపోయిన షేరు తాజాగా మరో 4 శాతం క్షీణించింది.
బ్యాంక్ పూర్తికాలపు డైరెక్టర్ల పదవీకాలంపై రిజర్వ్‌బ్యాంక్ పరిమితులు విధించడంతో కొద్ది నెలల క్రితం వ్యవస్థాపక సీఈవో ఉదయ్ కోటక్, జాయింట్ ఎండీ దీపక్ గుప్తాలు వైదొలిగారు. తాజాగా మరో సీనియర్ అధికారి మణియన్ సైతం రాజీనా మా చేయడంతో వివిధ బ్రోకరేజ్ సంస్థలు బ్యాంక్ షేర్లను విక్రయించమంటూ సిఫార్సు లు చేస్తున్నాయి. కోటక్ బ్యాంక్‌లో సుదీర్ఘకాలంగా పనిచేసిన కీలకమైన అధికారులు వైదొలగడం, తాజాగా వచ్చిన సీఈవో కొత్తకావడం, ఇటీవల ఆర్బీఐ నిషేధం విధించ డం కోటక్ బ్యాంక్‌కు ప్రతికూలతలని నువా మా స్టాక్ బ్రోకింగ్ అనలిస్టులు వివరించారు. ఈ మధ్యకాలంలో బ్యాంక్‌లో జరిగిన మార్పులు వచ్చే 12 నెలలపాటు వృద్ధిని, లాభాల్ని దెబ్బతీస్తాయని, షేరు టార్గెట్ ధరను రూ.2,095 నుంచి రూ. 1,530కు తగ్గించింది. బ్యాంక్‌కు తాజాగా రాజీనామా చేసిన మణియన్ ఫెడరల్ బ్యాంక్ సీఈవో, ఎండీగా చేరనున్నట్టు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.






