29-01-2026 10:36:25 AM
- ఫలించిన ప్రయత్నం, చిగురించిన స్నేహం
- పదవుల కోసమే పార్టీ ఫిరాయింపు అంటూ ఆరోపణలు
- తాజా మాజీ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత కాంగ్రెస్ లో చేరిక
సిద్దిపేట (విజయక్రాంతి): ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రయత్నం ఫలించడంతో స్నేహం చిగురించింది. దాని ఫలితంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్న, మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత లు బుధవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న మంత్రి పొన్న ప్రభాకర్ లు మిత్రులు. విద్యార్థి సంఘం నాయకులుగా కలిసి పని చేసిన సందర్భాలున్నాయి.
పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పోటీలో నిలిచినప్పటి నుంచి వెంకన్న సహాయ, సహకారాలు అందించారని, పొన్నం ప్రభాకర్ గెలుపులో వెంకన్న కీలక పాత్ర పోషించారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. బుధవారం రజిత , అనిత, వెంకన్నలు వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పటి ఆరోపణలాన్ని నిజమయ్యాయని హుస్నాబాద్ లో చర్చ జరుగుతోంది. అయితే వారు పార్టీ మారడం బిఆర్ఎస్ పార్టీకి కలిసొస్తుందని ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. పదవుల కోసం మాత్రమే పార్టీ మారారని బిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించినప్పటికీ పార్టీ ఫిరాయించడం నమ్మకద్రోహమేనని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.