calender_icon.png 29 January, 2026 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులూ.. జాగ్రత్త!

29-01-2026 01:23:03 AM

రాజకీయ నాయకులకు జీ హుజూర్ అంటే కష్టమే మరి..

  1. ప్రమోషన్, ఫోకల్ పోస్టింగ్, ఎక్స్‌టెన్షన్ కోసం వెంపర్లాడుతున్న అధికారులు 
  2. నిబంధనలు పట్టించుకోకుండా ఫైళ్లపై సంతకాలు 
  3. చివరికి కేసులు, విచారణలు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు

మేడిగడ్డ వ్యవహారం : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలుకుని.. నీటిపారుదల, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఈఎన్‌సీలు, సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈ.. ఇలా పదుల సంఖ్యలో అధికారులపై మేడిగడ్డ కుంగుబాటు సంఘటన, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అక్రమాలు, అవినీతిపై విచారణ జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ ఈ సంఘటనకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా.. అంతా అధికారులకే తెలుసని, ప్రాజెక్టు వ్యవహారాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని, ఎక్కడా అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఈ కేసును విచారిస్తున్న సిట్ ఇచ్చిన నోటీసుతో విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్ తదితరులు.. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరిగే సాధారణ అంశమని.. ఈ విషయంలో ఉన్నతాధికారులను కాకుండా.. కిందిస్థాయి అధికారులను విచారిస్తున్నారని, విచారించాలనుకుంటే అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, జితేందర్ లాంటి వారినికూడా విచారించాలని కోరడం గమనార్హం.

సింగరేణిలో టెండర్ గోల్‌మాల్ : తాజాగా జరిగిన ఈ సంఘటనలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒక మీడియా సంస్థ ఛైర్మన్ ఇంతకూడా జ్ఞానం లేకుండా రాశారు. నిబంధనలు, రూల్స్ మంత్రులకు ఏం తెలుసు.. అధికారులకే తెలుస్తాయి అంటూ తేల్చిచెప్పారు.

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి) : ఇప్పటివరకు జరిగిన అవినీతి, అక్రమాల సంఘటనలు.. నమోదైన కేసులు.. చేసిన విచారణల సందర్భంగా ప్రతిసారి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు.. బాధ్యత మొత్తం అధికారులపైకి తోసి.. చేతులు దులుపుకో వడమే కనిపిస్తున్నది. ఎందుకంటే.. పరిపాలనలో అజమాయిషీ రాజకీయ నేతలకే ఉంటున్నా.. నియమ నిబంధనలు, రూల్స్, చట్టాలకు లోబడి పని జరుగుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మాత్రం అధికారులదే. అక్రమాలు జరిగితే చిట్టచివరికి అధికారుల మెడకే అది చుట్టుకుంటున్నది.. అందుకే ఉన్నతాధికారులు విధి నిర్వహణలో జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి.

స్వప్రయోజనాల కోసం..

నిజానికి అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తే ఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తావుండదు. కానీ ఏ అధికారి విషయంలో తీసుకున్నా.. దాదాపు వారు 30 ఏండ్లపాటు అందిం చే ఉద్యోగ విధుల్లో భాగంగా అప్పుడప్పుడు వచ్చే ప్రమోషన్లు.. ఫోకల్ పోస్టింగులు.. రిటైర్మెంటు తరువాత ఎక్స్‌టెన్షన్ల విషయంలో తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నారు. రాజకీయనేతలు, ప్రజాప్రతినిధులను ఆశ్రయించి.. తమకు కావాల్సిన పదోన్నతిని, ఫోకల్ పోస్టింగ్‌ను పట్టుకుంటున్నారు.

ఇక.. భవిష్యత్తులో రిటైర్‌మెంట్ తరువాత ఎక్స్‌టెన్షన్ పొందవచ్చనే దూరాలోచనతో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పినదానికి గంగిరెద్దుల్లా తలూపుతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. నేతలు చెప్పిన దానికల్లా తలూపుతు న్నారు. తన ఉద్యోగ మాన్యువల్‌ను పట్టించుకోకుండా.. నిబంధనలను పక్కనపెట్టి.. చట్టాల ను అతిక్రమించి మరీ అవినీతి, అక్రమాలకు, అవకతవకలకు తెరలేపుతున్నారు. రాజకీయ నేతలు చెప్పినట్టల్లా ఫైళ్లను తయారుచేస్తూ  ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రశాంతంగా ఉండొద్దా.. 

ప్రతి ఉద్యోగి, అధికారికూడా.. తన రిటైర్మెంట్ తరువాత ప్రశాంతంగా తన కుటుం బంతో జీవించాలని కోరుకుంటారు. అయితే ఇలా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా మెలిగి.. వారి మెప్పుకో సం.. నిబంధనలు, చట్టాలను పట్టించుకోకుండా.. అవినీతి, అక్రమాలు, అవకతవక లకు మార్గం చూపేలా వ్యవహారాలను నిర్వహిస్తే.. తరువాత నమోదయ్యే కేసులు, ఎదు రయ్యే విచారణలు, కోర్టు కేసులతో రిటైర్ అయిన తరువాత మానసిక ప్రశాంతత కో ల్పోకతప్పదని విమర్శకులు స్పష్టంగా పే ర్కొంటున్నారు.

పైగా కుటుంబం యావత్తూ ఈ క్షోభను, బాధను అనుభవించాల్సి వస్తుందని, దీనితో కుటుంబంలోనూ ప్రశాంతం లేక.. తీవ్రమానసిక ఒత్తిడికి గురవుతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మన కండ్లముందు జరుగుతున్న సంఘటనలను, విచారణలను ఎదుర్కొంటున్న అధికారుల కు టుంబాలను ప్రత్యక్షంగా ఉదాహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారు లూ.. జర జాగ్రత్త.. ఉద్యోగంలో ఉన్నప్పుడు మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే.. తదనంతర పరిణామాలు..ప్రజలముందు దోషి లా నిలబెడ తాయని పరిశీలకులు హితవు పలుకుతున్నారు. 

జూనియర్లతో కలిసి..

ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న రాజకీ య నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పినదానికల్లా ‘ఓకే’ చెబుతూ.. నిబంధనలకు, రూల్స్‌కు విరుద్ధంగా ఫైళ్లు తయారుచేస్తే.. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు చేసే విచారణను అధికారులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు ఇప్పటిదాకా మన కండ్లముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్‌ను చేయించినట్టుగా ఆరోపణలు వచ్చిన ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నప్పటికీ.. విచారణ నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రపంచంలో ఏ మూల న ఉన్నా.. అక్రమాలకు పాల్పడితే తప్పించుకోవడం అసాధ్యం.

పైగా తాము పని చేసిన సమయంలో తమ కింద జూనియర్లుగా ఉన్నవారే.. ఇప్పుడు విచారణ చేస్తుండటంతో.. ఒకింత ఆత్మన్యూనతకు గురయ్యే అంశంగానే చెప్పవచ్చు. జూనియర్లతో విచారణను ఎదుర్కోవడం అనే ది.. తలదించుకోవాల్సిన అంశమే. ఇలాం టి పరిస్థితులు ఎదుర్కోవడానికా.. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించింది.. అని ఆలోచించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.