calender_icon.png 29 January, 2026 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన దుర్ఘటనలో అజిత్ పవార్ మృతి

29-01-2026 01:17:43 AM

అజిత్ పవార్ : 1959--2026

  1. మహారాష్ట్రలోని బారామతి సమీపంలో కుప్పకూలిన చార్టెడ్ ఫ్లుటై 
  2. ప్రమాదంలో డిప్యూటీ సీఎం సహా నలుగురు మృత్యువాత 
  3. మృతుల్లో పైలట్, కోనపైలట్.. ఒకరు సెక్యూరిటీ అధికారి, మరొకరు వ్యక్తిగత సహాయకురాలు
  4. నేడు బారామతిలో అంత్యక్రియలు 
  5. అరుదైన నేతను కోల్పోయాం: ప్రధాని మోదీ 

ముంబై, జనవరి ౨౬: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనతో సహా మరో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకరు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి, మరొకరు వ్యక్తిగత సహాయకురాలు, మరో ఇద్దరు పైల ట్లు. బుధవారం ఉదయం పుణె జిల్లాలోని బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

అజిత్ తన సొంత నియోజకవర్గమైన బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం విమానం లో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ముంబై నుంచి ఉదయం 8:10 గంటలకు ‘లియర్ జెట్ 45’ చార్టెడ్ విమానం బయల్దేరింది. 8:45 గంటల సమయంలో చార్టెడ్ విమానం రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. దట్టమైన పొగమంచు వల్ల విజిబిలిటీ లేకపోవడంతో పైలట్లు 800 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం సాగించారు.

ఈక్రమంలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు. రెండో ప్రయత్నంలో రన్ వేకు కేవలం 100 అడుగుల దూరంలో విమానం కుప్పకూలింది. తర్వాత క్షణాల్లోనే భారీ పేలుడు సంభవించింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంటలు తీవ్రం గా ఉండటంతో విమానంలోని వారెవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.

ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్వో) విదిత్ జాదవ్, పవార్ వ్యక్తిగత సహాయకురాలు పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ (కో శాంభవి పాఠక్ మృతి చెందారు. పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిపోయా యి. అజిత్ పవార్ ధరించిన గడియారం, దుస్తుల ఆధారంగా అధికారులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. డిప్యూటీ సీఎం మృతితో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. 

నేడు అంత్యక్రియలు..

కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అజిత్‌పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమసంస్కారాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. అజిత్ పవార్ బాబాయి ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్ దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రమాదం వెనుక కుట్ర కోణం : బెంగాల్ సీఎం మమత

అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండవచ్చని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. 

రాజకీయాలు చేయొద్దు.. : ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్

అజిత్‌పవార్ విమాన ప్రమాదంలోనే మృతిచెందాడని, దయచేసి ఆ ప్రమాదాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అధినేత శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. విషాదానికి రాజకీయ రంగు పూయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. దర్యాప్తు సంసలను తమ పనిని, తాము చేసుకోనివ్వాలని కోరారు.

ప్రముఖుల సంతాపం

* మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం విచారకరం. ఆయన ఒక సమర్థ నాయకుడిగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అందరి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

 ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

* అజిత్ పవార్ ప్రజలతో మమేకమయ్యే అరుదైన నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సంక్షేమం కోసం ఆయన ఎంతో శ్రమించారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన అద్భుతం. ఆయన మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.          

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

* అజిత్ పవార్ మరణం ఎన్డీయే కూటమితోపాటు నాకు కూడా వ్యక్తిగతంగా తీరని లోటు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

 అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

* ‘అజిత్ పవార్ గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ కష్టకాలంలో పవార్ కుటుంబ సభ్యులకు మరియు మహారాష్ట్ర ప్రజలకు తోడుగా ఉంటాను. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను.‘

 రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత 

* మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అజిత్ పవార్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజానేతగా ఆయనకు బారామతి నియోజకవర్గంలో ఎనలేని గుర్తింపు ఉంది. ఆయన కుటుంబా నికి భగవంతుడు మానసిక స్థుర్యైం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

రేవంత్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

* రైతు ఉద్యమ నేతగా తన ప్రజాజీవితాన్నిప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నా. శోకత్రప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

 కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత

* మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి ఎన్డీయే కూటమికి తీరనిలోటు. అజిత్ పవార్ దుర్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు. సుధీర్ఘకాలం పాటు డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ.. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు.

కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి 

* బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి, బాధకు గురిచేసింది. అజిత్ పవార్ బలమైన సామాజిక వర్గాలతో అనుబంధం ఉన్న అనుభవజ్ఞుడైన నాయకుడు. దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి అంకితమయ్యారు. 

  కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 


* మహారాష్ట్రలో విమాన ప్రమాద ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తోపాటు మరికొందరు మృతిచెందడం తనకు తీవ్ర ఆదేవనను కలిగించింది. ఈ విషాద ఘటన తీవ్రదిగ్భ్రాంతికరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.  

 రాంచందర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు