29-01-2026 01:28:28 AM
మేడారంలో తొలిఘట్టం
గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
ములుగు/మేడారం, జనవరి 28 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో బుధవారం తొలి అంకం ఘనంగా ప్రారంభమైంది. గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సారలమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి ప్రతిష్ఠ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాల నడుమ ఘనంగా సాగింది. కన్నెపల్లి గుడి నుంచి ప్రధాన పూజారి ఆధ్వర్యంలో.. భారీ పోలీసు బందోబస్తు మధ్య మేడారం చేరుకున్న సారలమ్మ తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు.
అడవుల మధ్య ప్రతిధ్వనించిన సంప్రదాయ వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలతో మేడారం భక్తి పారవశ్యంతో శివాలూగింది. జంపన్నవాగు నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉండే సారలమ్మ తల్లిని గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించటంతో.. సమ్మక్క సారలమ్మ జాతర అధికారికంగా ఆరంభమైందని గిరిజన పెద్దలు ప్రకటించారు. తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, ఎదుర్కోల్లిచ్చారు. నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
తమ కోరికలను తీర్చాలని వనదేవతలకు కోరుకున్నారు. జాతర తొలి రోజునే లక్షలాది భక్తులు మేడారానికి తరలిరావడంతో అర ణ్య ప్రాంతమంతా జనసంద్రమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించటంతో ప్రారంభమైన ఈ మహాజాతర గురువారం సమ్మక్క తల్లి రాకతో మరింత ఉత్సవ శోభను సంతరించుకోనుంది.
వన మన జాతర
జనారణ్యంగా మేడారం!
మేడారం, జనవరి 28 (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని మేడారం భక్తజన జాతరగా మారింది. బుధవారం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు, భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. వెంట తెచ్చుకున్న కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి చేస్తున్నారు.
కుటుంబాలను చల్లగా దీవించు తల్లీ అంటూ దేవతలను కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలను సమర్పిస్తున్నారు. వచ్చే నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలిరానున్నారు. మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు, కోయ దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.
విదేశాల నుంచి కూడా మానవ శాస్త్ర పరిశోధకులు ఈ అరుదైన గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయడానికి విచ్చేస్తున్నారు. జాతర అధికారికంగా ఇప్పుడే మొదలైనప్పటికీ, రద్దీని దృష్టిలో ఉంచుకుని గత వారం రోజుల నుంచే భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది.
అడవి తల్లుల ఆశీస్సుల కోసం..
లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి పులకించిపోతోంది. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటిచెప్పే ఈ జాతర, కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది కోట్లాది మంది నమ్మకం. మేడారంలో ఎక్కడ చూసినా బెల్లం (బంగారం) కుప్పలే కనిపిస్తున్నాయి. భక్తులు తమ కోరికలు తీరినందుకు కృతజ్ఞతగా తల్లులకు ‘బంగారం’ సమర్పించుకుంటున్నారు. గిరిజన ఆచారం ప్రకారం గొర్రెలు, మేకలను సమర్పించి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు.
కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జంపన్న వాగు ఇప్పుడు భక్తుల స్నానాలతో జన సముద్రాన్ని తలపిస్తోంది. వాగులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాగా గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా అత్యాధునిక సెన్సార్ల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. 50కి పైగా మొబైల్ మెడికల్ యూనిట్లు, ఎమర్జెన్సీ కోసం ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం సిద్ధంగా ఉన్నాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా ’మేడారం యాప్’ అందుబాటులోకి తెచ్చారు, దీని ద్వారా పార్కింగ్ ప్లేసులు, ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
కాగా మంత్రి సీతక్క స్వయంగా జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 42,000 మంది ప్రభుత్వ సిబ్బందిని విధుల్లో ఉంచారు. ముఖ్యంగా తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ఈసారి ’క్యూఆర్ కోడ్’ ట్యాగ్లను చిన్నపిల్లలకు, వృద్ధులకు ధరింపజేస్తున్నారు. కాగా మేడారం వెళ్లే రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
రాత్రి వేళ కాంతులతో మేడారం
పగలు భక్తుల రద్దీతో నిండిపోయే మేడారం, రాత్రి వేళ అద్భుతమైన కాంతులతో మెరిసిపోతున్నది. వాగు ఒడ్డున, చెట్ల కింద వేలాది మంది భక్తులు వంటలు చేసుకుంటూ, చిన్న చిన్న దీపాలు వెలిగిస్తారు. ఆకాశం నుంచి చూస్తే అడవి అంతా నక్షత్రాలు నేల మీద రాలినట్లు కనిపిస్తుంది. లక్షలాది మందికి భోజనం అందించడం సామాన్య విషయం కాదు. కానీ మేడారంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రతి అడుగునా అన్నదానం నిర్వహిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా అందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయడం ఇక్కడి ప్రత్యేకత. చాలా మంది భక్తులు తమ ఇళ్ల నుంచే బియ్యం, పప్పు తెచ్చుకుని, మేడారం చెట్ల కింద ’వన భోజనాలు’ చేస్తారు. ఇది ఒక గొప్ప పర్యాటక అనుభవాన్ని కూడా ఇస్తుంది. మేడారం అంటే కేవలం మొక్కులు తీర్చుకోవడం మాత్రమే కాదు, అది తెలంగాణ గిరిజన అస్తిత్వానికి, ధైర్యానికి ప్రతీక. ఆధునిక ప్రపంచం లో మనిషికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని బంధాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది.
అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం
మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్ట పైనుంచి తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. వనదేవత మేడారం గద్దెకు వస్తున్న సమయంలో శివసత్తుల పూనకాలు, డప్పుల మోతతో అడవి మారుమోగిపోతుంది.
కాగా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాన కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జాతరలో తొక్కిసలాట
ములుగు/మేడారం, జనవరి 28 (విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా బుధవారం భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దర్శన క్యూ లైన్ల వద్ద తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్ర గాయమవ్వగా, అక్కడే ఉన్న ఎన్‌ఎస్‌ఎస్ వలం టీర్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోపులాటలో కిందపడ్డ వృద్ధులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా దర్శనానికి సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గుర్తించిన పోలీసులు.. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు ఆ షాపులను తొలగించారు.