యజమానిని హత్య చేసిన బీహారీలు

23-04-2024 02:11:02 AM

సిద్దిపేట జిల్లా జగదేవ్‌లోపూర్‌లో దారుణం

సిద్దిపేట, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో రాంరెడ్డి చికెన్‌సెంటర్ యజమానిని అతనివద్దనే పని చేస్తున్న ఇద్దరు బీహారీలు హత్య చేసి పరారయ్యారు. ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం ప్రకా రం.. తూప్రాన్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బుచ్చిరెడ్డి మహిపాల్‌రెడ్డి(40) జగదేవ్‌పూర్‌లో చికెన్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నా డు. తన దగ్గర పనిచేస్తున్న బీహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చికెన్‌సెంటర్‌లో ఉపాధి పొందుతూ రంజాన్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లారు. వారి స్థానంలో బీహార్‌కి చెందిన కూరాబల్, రూబల్‌ను అనే వ్యక్తులను గత నెలలో పనిలో పెట్టుకున్నాడు. ప్రతి రోజు 8గంటల వరకు కొనసాగే చికెన్‌సెంటర్ ఆదివారం సాయంత్రం 5గంటలకే మూసివేశారు. ఆదివారం యజమానికి మహిపాల్‌రెడ్డి భార్య మానస నాలుగు గంటల ప్రాంతంలో ఫోన్ చేసి బంధువుల విందుకు రావాలని కోరగా సోమవారం ఆర్డర్ ఉందని ఇచ్చి వస్తానని చెప్పాడు.

మళ్లీ సాయంత్రం భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్‌ఆఫ్ వచ్చింది. వెంటనే మహిపాల్‌రెడ్డి సోదరుడు శ్రీపాల్‌రెడ్డి కూడా ఫోన్‌చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. 9గంటల ప్రాంతంలో ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో సోమవారం ఉదయం చికెన్‌సెంటర్ ఎదురుగా ఉన్న ఓ దుకాణ యజమానికి ఫోన్ చేసి చికెన్ సెంటర్ తెరిచి ఉన్నదా అని వాకబు చేయగా మూసిఉందని చెప్పడంతో భార్య మానస, సోదరుడు శ్రీపాల్‌రెడ్డిలు జగదేవ్‌పూర్‌కు చేరుకున్నారు. మూసి ఉన్న చికెన్‌సెంటర్ షటర్ తీసి మొత్తం కలియదిరిగారు. వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో అను మానం వచ్చి మూలకున్న దుప్పట్లను చూసేసరికి మహిపాల్‌రెడ్డి మృతదేహం లభ్య మైంది. ఒంటిపై గాయాలు, కాళ్లు, చేతులకు వైర్లు కట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే జగదేవ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి ఎస్‌ఐ చంద్రమోహన్‌రెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి చేరుకుని పరిసరాలను పరిశీలించగా, సీసీకెమెరా వైర్లను తెంపి ఉండడం, ‘డీవీఆర్’ భవనం వెనుక ప్రాంతంలో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.