calender_icon.png 2 November, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబ్‌లో నో ఏసీ

04-05-2024 02:00:44 AM

నో ఏసీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న క్యాబ్ డ్రైవర్లు 

కమిషన్ చార్జీలు పెంచాలని డిమాండ్ 

క్యాబ్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలి

గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): రోజు రోజు పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు, ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు నగరంలో వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నా ఫలితం లేదు. నగరంలో కొన్నిరోజులుగా క్యాబ్ డ్రైవర్లు నో ఏసీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మూడు వారాలుగా నో ఏసీ క్యాంపెయిన్

నగరంలో ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థలలో దాదాపు 1.25లక్షల టాక్సీలు నడుస్తున్నాయి. ఆయా కంపెనీలు వీరికి కిలో మీటరుకు రూ. 10నుంచి 12వరకు కమిషన్ చెల్లిస్తున్నాయి. ఏసీ ఆన్ చేస్తే కిలో మీటరు రూ.16నుంచి రూ. 18వరకు ఖర్చవుతున్నట్టుగా డ్రైవర్లు చెబుతున్నారు. కంపెనీలు చెల్లించిన రూ. 12 పోను అదనంగా ఖర్చయ్యే రూ. 6ను టాక్సీ డ్రైవర్లే భరించాల్సి వస్తోందని గిగ్ డ్రైవర్లు వాపోయారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఏసీ చాలు హువాతో అకౌంట్ ఖాళీ హుగా అంటూ ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టారు. వినియోగదారులు తమ సమస్యల ను అర్థం చేసుకొని క్యాంపెయిన్‌కు సహకరిస్తున్నారని టాక్సీ డ్రైవర్లు తెలిపారు. యాప్ ఆధారిత, సాధారణ టాక్సీలకు ఒకే విధమైన చార్జీలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రచార క్యాంపెయిన్‌కు పలు కార్మిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. 

క్యాబ్ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలి

ఊబర్, ఓలా, రాపిడో సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 40వేలకు పైగా టాక్సీ డ్రైవర్లు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. వినియోగదారుడికి నో ఏసీ క్యాంపెయిన్  స్టిక్కర్ కన్పించేలా ప్రచారం చేపడుతున్నాం. ఏసీ ఆన్ చేస్తే నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను వివరిస్తున్నాం. కర్నాటక తరహాలో యాప్ ఆధారిత టాక్సీలకు ప్రభుత్వమే ధరలను నిర్ణయించాలి. సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఊబర్, ఓలా, రాపిడో సంస్థల తో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి మా డిమాండ్‌ను పరిష్కరించాలి. 

 సలావుద్దీన్, తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు