05-05-2024 12:10:00 AM
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు
ఉగ్రదాడులు జరిగితే ఏడుస్తూ కూర్చునేది
బీజేపీ వచ్చాక పాకిస్థాన్ పెడబొబ్బలు పెడుతోంది
సర్జికల్ దాడులతో పాక్ నేతల వెన్నులో వణుకు
రాకుమారుడు ప్రధాని కావాలని పాక్ నేతల ఆశ
బలమైన భారత్.. బలమైన ప్రభుత్వాన్ని కావాలనుకుంటోంది..
రాంచీ, మే 4: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై దునుమాడారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు పిరికపంద లాంటివంటూ దుయ్యబట్టారు. ఎప్పుడైనా దేశంలో ఉగ్రదాడులు జరిగితే అంతర్జాతీయ వేదికలపై ఏడుస్తూ కూర్చునేదంటూ ఎద్దేవా చేశారు. జార్ఖండ్‌లోని పాలమూలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు సాయం కోసం పాకిస్థాన్ పెడ బొబ్బలు పెడుతోందని పేర్కొన్నారు. ‘గతంలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతర్జాతీయ వేదికలపై ఏడుస్తూ కూర్చునేవి. అలాంటి వేదికలపై ఏడ్చే భారత్ కాలం పోయింది. ఇప్పుడు పాకిస్థానే.. సాయం కోసం ఏడుస్తూ.. పెడబొబ్బలు పెట్టే కాలం వచ్చింది’ అని మోదీ చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతి స్థాపన కోసం పాకిస్థాన్‌కు ప్రేమ లేఖలు రాసేదని, కానీ దాయాది దేశం మాత్రం అందుకు సమాధానంగా ఉగ్రవాదులను పంపేదని గుర్తు చేశారు.
ఇంట్లోకొచ్చి మరీ చంపేస్తాం..
ఇప్పుడు భారత్ రాయబారాలు పంపబోదని, ఇది నయా భారత్ అని ప్రధాని మోదీ అన్నారు. ఇల్లు పగులగొట్టి మరీ హతమారుస్తామంటూ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. జార్ఖండ్, బీహార్ ప్రజలు దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద చాలామంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సర్జికల్ దాడులు జరపడంతో వణికిపోతున్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు.. రాకుమారుడు భారత్ ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నారంటూ రాహుల్‌ను దుయ్యబట్టారు. బలమైన భారత్.. బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు.
తరాలకు సరిపడా సంపాదన..
జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. అవినీతి జేఎంఎం, కాంగ్రెస్ నేతలు తరాలకు సరిపడా సంపదను పోగేసుకున్నారంటూ దుయ్యబట్టారు. ‘నాకు ఇల్లు కానీ, సైకిల్ కానీ లేదు. 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినా.. ఒక్క అవినీతి మరక నాపై లేదు’ అని చెప్పారు.