04-05-2024 02:11:01 AM
బీఆర్‌ఎస్ హయాంలోనే సిద్దిపేట అభివృద్ధి
కళ్లుండీ చూడలేకపోతున్నారు
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు ఉండి కూడా సిద్దిపేట అభివృద్ధి చూడలేకపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవనీ, సిద్దిపేటకు బీఆర్‌ఎస్ పార్టీ ఏం చేయలేదో రేవంత్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట పుణ్యమాని రేవంత్ సీఎం అయ్యాడని, లేకుంటే చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే వారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఆగస్టు 15న సిద్దిపేటకి వస్తా అనే సవాల్‌ని స్వీకరిస్తున్నానని, విలువలతో కూడిన రాజకీయాలు చేయడ మే నాకున్న అలవాటని అన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేసి సీఎంకు శాలువాతో సన్మానం చేస్తానని, వ్యక్తిగా నా కంటే కోట్లాది ప్రజలకు న్యాయం జరగడమే నాకు ముఖ్యమని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందని, ఒకవేళ రాజీనామాకు సిద్ధంగా లేకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా అని సీఎంకు సవాలు విసిరారు. ఒకరేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు, మరొకరేమో దేవుని మీద ప్రమాణాలు చేసి ఓట్లు అడుగుతున్నారని బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శణాస్త్రాలు సందించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అని, రేవంత్ ఢిల్లీకి గులాం గిరి చేస్తున్నారని ఆరోపించారు.