21-12-2025 12:09:03 AM
నాని హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. స్టార్ కాస్టింగ్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో కథానాయకుడు నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. శికంజ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో మంచు మెహన్‌బాబు అలరించనున్నారు. రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేశ్‌బాబు కూడా నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిర్యానీ అనే పాత్రలో సంపూ కనిపించనున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సంపూ ఒంటి నిండా రక్తపు మరకలతో, భుజాన గొడ్డలి వేసుకుని, బీడీ తాగుతూ చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న క్రూరత్వం చూస్తుంటే, ఇందులో ఆయన కేవలం కామెడీకి పరిమితం కాకుండా ఒక శక్తిమంతమైన పాత్ర చేస్తున్నట్టు అర్థమవుతోంది. కథానాయకుడు ‘జడల్’కు క్లోజ్ ఫ్రెండ్, విధేయతకు ప్రతీకగా నిలిచే పాత్రలో సంపూ కనిపిస్తారని పేర్కొన్నారు.
సంపూ ‘బిర్యానీ’ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ తనదైన కామెడీతో నవ్విస్తూ ‘బర్నింగ్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సంపూర్ణేశ్‌ను ఈ సినిమాలో సరికొత్త ఊర మాస్ అవతారంలో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో భాగంగా ‘బిర్యానీ’ పాత్ర కోసం సంపూను పూర్తిగా మార్చేశాడు. ఈ పాత్ర కోసం సంపూ చాలా బరువు తగ్గి, తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నట్టు చిత్రబృందం తెలిపింది.
శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో పాత్రలను చాలా సహజంగా, గంభీరంగా చూపిస్తారు. ‘దసరా’లో కమెడియన్లను కూడా సీరియస్ పాత్రల్లో చూపించినట్టుగానే, ఇప్పుడు సంపూర్ణేశ్‌లోని యాక్షన్ యాంగిల్‌ను బయటకు తీయబోతున్నారు. “హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ‘బిర్యానీ’ లేకుండా ఉండదు” అంటూ ఈ పాత్రను పరిచయం చేసిన తీరు సినీప్రియులను ఆకట్టుకుంటోంది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి 8 భాషల్లో 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తుండగా, ఎడిటింగ్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు.