calender_icon.png 12 November, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేటలో బీజేపీ భారీ అర్ధనగ్న ర్యాలీ

12-11-2025 12:00:00 AM

నారాయణపేట ,టౌన్, నవంబర్ 11 (విజయక్రాంతి) :  పేట జిల్లా కేంద్రంలో ప్రజలకు కనీస వైద్యం అందించేందుకు వారం రోజుల్లో  ఆస్పత్రి ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.ఆస్పత్రి చేయక పోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో  బిజెపి ఆధ్వర్యంలో  అర్ధనగ్న నిరసన ప్రదర్శన భారీగా నిర్వహించారు.

ఈ అర్ధనగ్న నిరసన ర్యాలీ పళ్ల హనుమాన్ దేవాలయం నుంచి శివాజీ నగర్, సరాఫ్ బజార్, సెంటర్ చౌక్, మీదుగా మెయిన్ రోడ్, విరసావర్కర్ చౌరస్తా నుండి సత్యనారాయణస్వామి చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమశిక్షణా సంఘం సభ్యుడు నాగురావు నామాజీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ఏర్పడి 7 సంవత్సరాలు గడిచిందని జిల్లా ఏర్పడితే అభివృద్ధి చెందుతుందని ఈ జిల్లా సాక్షాతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ ప్రభుత్వం అడియాశలు చేసిందని అన్నారు.

సీఎం సొంత జిల్లాలో కనీసం ప్రథమ చికిత్సకు ప్రజలు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి తరలించి 6 నెలలు గడిచిందని అప్పటి నుంచి పట్టణ ప్రజలతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు కనీస వైద్యానికి నోచుకోక ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన 20 మంది సకాలంలో వైద్యం అందక మరణించారని తెలిపారు.ఆస్పత్రిని తరలించినప్పటి నుంచి బిజెపి అనేక ఉద్యమాలు చేపట్టిందని  అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పందన లేదని అన్నారు.

బిజెపి ఉద్యమం చేసినప్పుడు మాజీ డిసిసి అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో 8 కోట్లతో ఏరియా ఆస్పత్రి నిర్మిస్తామని అంతేకాకుండా ఎమ్మెల్యే చొరవతో మరో కోటి పెంచి నిర్మిస్తామని ప్రకటించారని ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు.ఇప్పటికే 20 మంది చనిపోయారని అక్కడ చ చ్చిన వారిని మాత్రం ఇక్కడ పోస్టు మార్టం కోసం పాత ఆస్పత్రికి తీసుకు వస్తున్నారని అన్నారు.

ఈ ఆస్పత్రి పోస్టు మార్టం చేసేందుకే పనికి వస్తుందా .ఇంకెంత మంది చనిపోతే ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.  వారం రోజుల్లో ఆస్పత్రిని ప్రారంభించాక పోతే బిజెపి ప్రజల వెంబడి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆస్పత్రిని ఏర్పాటు చేసే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు,జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు కెంచే శ్రీనివాసులు,జిల్లా కోశాధికారి సిద్ధి వెంకట్రాములు,,పట్టణ బిజెపి అధ్యక్షుడు పి.వినోద్ కుమార్,మాజీ కౌన్సిలర్లు,వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.