13-09-2025 07:33:18 PM
తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తంది
సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్
హుస్నాబాద్: నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, నిజాం సర్కార్‌ను గద్దె దించింది భారత కమ్యూనిస్టు పార్టీయేనని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో పార్టీ కార్యకర్తలతో కలిసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయకుండా తమ గుప్పిట్లో పెట్టుకున్న నిజాం సర్కార్‌ను గద్దె దించేందుకు తెలంగాణ రైతాంగం కమ్యూనిస్టుల నేతృత్వంలో వీరోచితంగా పోరాడిందని గుర్తు చేశారు. హిందూ ముస్లింలు కలిసి సంఘటితంగా పోరాడిన ఆ పోరాట చరిత్రను వక్రీకరిస్తే బీజేపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దోపిడీ, అసమానత్వాన్ని రూపుమాపేందుకు సాగిన సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటాలకు 77 ఏండ్లు నిండాయని గుర్తు చేశారు. నిజాం పాలనలో అణిగిపోయిన ప్రజల చేత బందూకులు పట్టించిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు.
హుస్నాబాద్ అభివృద్ధిలో ఎర్రజెండా పాత్ర
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో హుస్నాబాద్ ప్రాంతంలోనూ భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసిందని పవన్ తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి, గౌరవెల్లి రిజర్వాయర్ కోసం సీపీఐ చేసిన పోరాటాలు ప్రజలందరికీ తెలిసినవే అన్నారు. అమరుల ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్ముల భాస్కర్, ఎడల వనేశ్, జేరిపోతుల జనార్దన్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎగ్గోజు సుదర్శన చారి తదితరులు పాల్గొన్నారు.